
యూపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు.
లక్నో: వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. నల్లధనంతో బ్యాంకులకు వచ్చే ముఖాలకు నల్లరంగు పూలమాలని ఆయన బుధవారం వ్యాఖ్యానించారు. ఇలా చేస్తే మరోసారి నల్లధనం పట్టుకురారని చెప్పారు. నల్లకుబేరులు ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టడానికి కూడా జంకుతారని అన్నారు.
పాత పెద్ద నోట్ల మార్పిడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబా బ్యాంకుకు వెళ్లి వరుసలో నిలబడడంపై ఆజంఖాన్ స్పందించారు. హీరాబా బ్యాంకుకు వెళుతున్నారని తెలిస్తే ఆమెకు బదులు తానే క్యూలో నిలబడేవాడినని, పెద్దావిడ కష్టపడకుండా చూసేవాడినని అన్నారు.
గుజరాత్ లోని గాంధీనగర్ సమీపంలో ఉన్న రాయ్ సన్ గ్రామంలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)లో మంగళవారం హీరాబా రూ.4500 నగదు మార్చుకున్నారు. తల్లిని కష్టపెట్టారని ప్రధాని మోదీపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విమర్శలు గుప్పించాయి.