అంతా భ్రాంతియేనా..!

There Is No Budget Allotment For Kaleshwaram Project - Sakshi

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంపై కనిపించని దయ

కాళేశ్వరం, పసుపు బోర్డుల ఊసే లేదు

సాక్షి, హైదరాబాద్‌:  కేంద్ర బడ్జెట్‌ మళ్లీ రాష్ట్రానికి నిరాశే మిగిల్చింది. మాంద్యం నేపథ్యంలో కేంద్రం నుంచి ఉదారంగా సాయం అందుతుందని, కేంద్ర ప్రశంసలు అందుకున్న పథకాలకు నిధులు ఇస్తుందని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వ ఆశలు అడియాశలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, పసుపు బోర్డు ఏర్పాటు లాంటి అంశాల ఊసే లేదు. తెలుగింటి కోడలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండో లెక్కల పద్దులో ఏపీ పునర్వ్యవస్థీకరణ గురించి పట్టించుకోలేదు. రాష్ట్రం అడిగిన పథకాలకు కనీస నిధులు కూడా కేటాయించలేదు.

రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం.. 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగు, తాగు నీటి పథకాలకు నిధులు కేటాయించకపోవడంతోపాటు పన్ను వాటాలోనూ కోత పెట్టడంతో ఈసారి రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగులకు పీఆర్సీ అమలు, నిరుద్యోగ భృతి లాంటి వాటి అమలుకు ఆర్థిక వెసులుబాటు కష్టమేనని లెక్కలు వేస్తున్నాయి. మాంద్యం కారణంగా రాష్ట్ర ఆదాయంలో కొంత తగ్గుదల కనిపిస్తోందని, దీంతో భారీ వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్ర మంత్రులను కలవడంతోపాటు కేంద్రానికి లేఖలు రాశారు. మంత్రి హరీశ్‌రావు 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌తో భేటీలో కాళేశ్వరం, మిషన్‌ భగీరథల నిర్వహణ కోసం రూ.52 వేల కోట్లు ఇవ్వాలని కోరారు.

ఏదో అలా అలా.. 
పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బకాయిలు, ఐజీఎస్టీ చెల్లింపులు, పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.35 వేల కోట్ల వరకు అదనపు నిధులు కేటాయిస్తారని ప్రభుత్వం ఆశించింది. కానీ తెలంగాణకు రూ.16 వేల కోట్ల పన్నుల వాటానే కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించడం గమనార్హం. దీంతో ప్రస్తుత సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు వచ్చే ఏడాది నిధుల కటకట తప్పదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక, కొత్త పథకాల అమలుకు అవకాశాల్లేవని తేల్చేస్తున్నారు. ఇక 2020–21 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ లెక్కలు కూడా ఆచితూచి ఉంటాయని పేర్కొంటున్నారు.

అందులోనూ కోతే.. 
పన్నుల వాటాలోనూ కేంద్రం రాష్ట్రానికి కోత పెట్టింది. మొత్తం పన్ను వాటాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.437 శాతం ఇవ్వగా, దాన్ని 2.133 శాతానికి కుదించింది. 2019–20లో రూ.17 వేల కోట్లకు పైగా పన్నుల వాటా అంచనాలను పెట్టిన కేంద్రం ఇప్పుడు మరో రూ.వెయ్యి కోట్లు తగ్గించి రూ.16 వేల కోట్ల పైచిలుకు చూపెట్టింది. అందులో ఎంత ఇస్తుందన్న దానిపైనా అనుమానాలున్నాయని ఆర్థిక వర్గాలు అంటు న్నాయి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ లాంటి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బడ్జెట్‌లో ప్రస్తావించనేలేదు.

అయితే, బెంగళూరులో మెట్రో తరహాలో సబర్బన్‌ రైల్వే వ్యవస్థకు రూ.18,600 కోట్లను ప్రతిపాదించిన కేంద్రం తెలంగాణలోని గ్రామాల రూపురేఖలను మార్చే రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ట్రిపుల్‌ ఆర్‌) లాంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కేంద్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రతిపాదనలపై 4 గంటల పాటు ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం.. కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరిచారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top