ఎయిమ్స్‌లో.. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’

Teen Pretend As AIIMS Doctor For Five Months - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అద్నన్‌ ఖుర్రమ్‌ 19 ఏళ్ల యువకుడు. ఎంతటివారినైనా బురిడీ కొట్టించగల ఘనుడు. తన ప్రతిభతో డాక్టర్‌ సీటు సంపాదించలేకపోయాడు గానీ  ప్రొఫెసర్ల కళ్లుగప్పి ఐదు నెలలపాటు ఎయిమ్స్‌ జూనియర్‌ డాక్టర్‌గా నటిస్తూ లబ్ది పొందాలని చూశాడు. చివరికి మోసం బయటపడటంతో కటకటాల పాలయ్యాడు.

బీహార్‌ టూ ఢిల్లీ..
బీహార్‌కు చెందిన అద్నన్‌ ఖుర్రమ్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌ ప్రొఫెసర్లతో పరిచయం పెంచుకున్నాడు. కేం‍ద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎమ్‌సీ) బిల్లుకు వ్యతిరేకంగా రెసిడెంట్‌ డాక్టర్‌ అసోసియేషన్‌(ఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌లో ఖుర్రమ్‌ తనను తాను జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌గా వారికి పరిచయం చేసుకున్నాడు.

మోసం బయటపడిందిలా..
ఆర్డీఏ చేపట్టే ప్రతీ నిరసన కార్యక్రమాల్లో, మారథాన్లలో  ఖుర్రం చురుగ్గా పాల్గొనేవాడు. అయితే ఆ కారణంగానే అతని మోసం బయటపడింది. మామూలుగా జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లకు 18 నుంచి 20 గంటల డ్యూటీ ఉంటుంది. డ్యూటీ చేయకుండా ఖుర్రం ఎప్పుడూ బయటే కనిపించేవాడని, దాంతో అతనిపై అనుమానం కలిగిందని డాక్టర్‌ హర్జీత్‌ సింగ్‌ భట్టి తెలిపారు. వెంటనే విద్యార్థుల ప్రవేశ పట్టికతో పాటు స్టైఫండ్‌ పొందే విద్యార్థుల జాబితా పరిశీలించగా ఖుర్రమ్‌ పేరు ఎక్కడా కనిపించలేదని ఆయన పేర్కొన్నారు.

ఎయిమ్స్‌లో సుమారు 2 వేల మంది రెసిడెంట్‌ డాక్టర్లు ఉంటారని.. అందుకే ఖుర్రం మోసాన్ని కనుక్కోలేకపోయామని తెలిపారు. అంతేకాకుండా నిరసనకు మద్దతు తెలిపేందుకు వచ్చే వీఐపీలతో ఫొటోలు దిగడానికి మాత్రమే ఆసక్తి చూపేవాడని పేర్కొన్నారు. అలా రాహుల్‌ గాంధీ, లాలూ ప్రసాద్‌ వంటి ప్రముఖ వ్యక్తులతో ఫొటోలు దిగి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. జూనియర్‌ డాక్టర్లుగా చెప్పుకుంటూ తమ కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు పొందారన్నారు. ఖుర్రంను అరెస్టు చేసిన పోలీసులు సెక్షన్‌ 419(మోసం), సెక్షన్‌ 468(ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం)ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top