‘మిరాజ్‌’.. భారత్‌ వజ్రాయుధం | Surgical Strike 2 Why Airforce Use Mirage 2000 | Sakshi
Sakshi News home page

‘మిరాజ్‌’.. భారత్‌ వజ్రాయుధం

Feb 26 2019 3:58 PM | Updated on Feb 26 2019 4:51 PM

Surgical Strike 2 Why Airforce Use Mirage 2000 - Sakshi

న్యూఢిల్లీ : యుద్ధంలో అనుభవమున్న సైనికునికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. కారణం అప్పటికే అతను పలు యుద్ధాల్లో పాల్గొని ఉంటాడు. పరిస్థితులు ఎలా ఉంటాయో అతనికి ముందే తెలిసి ఉంటాయి కాబట్టి. ఈ రోజు భారత వాయుసేన జరిపిన సర్జికల్‌ స్ట్రైక్‌లో కూడా దీన్నే పాటించింది. అధునికత కన్నా అనుభవానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం మన వైమానిక దళంలో సుఖోయ్‌ 30 ఎంకేఐ, తేజస్‌, మిగ్‌ 29 వంటి ఆధునిక యుద్ధవిమానాలు ఉన్నప్పటికి.. ఈ దాడికి మిరాజ్‌నే ఎంచుకుంది. భారత వజ్రాయుధంగా పిలుచుకునే మిరాజ్‌ 2000 వివరాలు..

ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఉన్న అతిముఖ్యమైన యుద్ధవిమానాల్లో మిరాజ్ 2000 ఒకటి. 1985లో ఇవి భారత వైమానిక దళంలో చేరాయి. వీటిని దసాల్ట్ ఏవియేషన్ సంస్థ అభివృద్ధి చేసింది. అప్పుడు వీటికి ‘వజ్ర’ అని నామకరణం చేశారు. 1999‌లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత్ వీటిని ఉపయోగించింది. ఈ యుద్ధంలో భారత దేశం విజయం సాధించడానికి కారణం మిరాజ్ 2000 విమానాలే. ఈ ఫలితంతో భారత ప్రభుత్వం మరిన్ని మిరాజ్ విమానాలను ఆర్డర్ చేసింది. ప్రస్తుతం భారత్‌తో పాటు ఎనిమిది దేశాలు ఈ విమానాలను ఉపయోగిస్తున్నాయి.

ప్రత్యేకతలు..
సింగిల్ సీట్ ఉండే ఈ విమానంలో తేలికైన చిన్న ఇంజిన్ మాత్రమే ఉంటుంది. దీని బరువు 7500 కిలోలు. గంటకు 2,336 కిలో మీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. గగనతలంలో 17 కిలో మీటర్ల పై నుంచి దాడి చేసే సామార్థ్యం దీని సొంతం. లేజర్ గైడెడ్ బాంబులను సులభంగా తీసుకెళ్లే ఈ విమానం గగన తలం నుంచి గగన తలంలోకి, గగనతలం నుంచి భూతలానికి దాడి చేయగలదు. అదే సమయంలో భూమికి అతితక్కువ ఎత్తులో అత్యధిక వేగంతో కూడా ప్రయాణించగలదు.

ఈ ప్రత్యేకత వ్లల రాడార్లలో దీన్ని గుర్తించడం శత్రు శిబిరానికి కష్టంగా మారిపోతుంది. లేజర్‌ గైడెడ్‌ బాంబులను కూడా మిరాజ్‌ ప్రయోగించగలదు. అందుకే చకచకా పూర్తి కావాల్సిన ఆపరేషన్లకు భారత వాయుసేన మిరాజ్‌నే ఎంచుకొంటుంది. దీనికి తగ్గట్టే కేవలం 21 నిమిషాల్లోనే మిరాజ్‌ విమానాలు శత్రు స్థావరాలను ధ్వంసం చేసి క్షేమంగా తిరిగి వచ్చాయి.

తోక ముడిచిన పాక్‌ ఎఫ్‌ - 16
అయితే భారత్‌ మిరాజ్‌ యుద్ధ విమనాలను కొనుగులు చేయడంతో దీనికి ప్రతిగా పాక్‌ అమెరికా తయారు చేసిన ఎఫ్‌ -16 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. నేడు బాలాకోట్‌ దాడి సందర్భంగా ఈ రెండు యుద్ధవిమానాలు ముఖాముఖీ తలపడ్డాయి. కానీ మిరాజ్‌ దెబ్బకు పాక్‌ విమానాలు తోకముడిచాయి. (ఇక్కడ చదవండి : విఫలమైన పాకిస్తాన్‌ ప్రతి దాడి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement