కరోనా ఎఫెక్ట్‌ : రూ 8000 కోట్ల నష్టం

Surat Diamond Industry Likely To Face A Loss Due To Corona Virus - Sakshi

అహ్మదాబాద్‌ : చైనాలో కరోనా వైరస్‌ కలకలంతో సూరత్‌ డైమండ్‌ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడింది. సూరత్‌ నుంచి వజ్రాలు ఎగుమతయ్యే హాంకాంగ్‌లో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించడంతో రానున్న రెండు నెలల్లో ఇక్కడి డైమండ్‌ పరిశ్రమకు దాదాపు రూ 8000 కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా వ్యాప్తితో హాంకాంగ్‌లో మార్చి తొలివారం వరకూ స్కూల్స్‌, కాలేజీలను మూసివేశారు. మరోవైపు వైరస్‌ భయంతో వ్యాపారాలు కూడా తగ్గుముఖం పట్టాయని నిపుణులు చెబుతున్నారు. సూరత్‌ నుంచి హాంకాంగ్‌కు ఏటా రూ 50,000 కోట్ల విలువైన పాలిష్డ్‌ వజ్రాలు ఎగుమతవుతాయని, ఇక్కడి నుంచి డైమండ్‌ ఎగుమతుల్లో ఇవి 37 శాతమని జెమ్స్‌ అండ్‌ జ్యూవెలరీ ఎక్స్పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ప్రాంతీయ చైర్మన్‌ దినేష్‌ నవదియా పేర్కొన్నారు.

హాంకాంగ్‌లో నెలరోజుల పాటు సెలవులు ప్రకటించడంతో అక్కడి కార్యాలయాల్లో పనిచేస్తున్న గుజరాతీ వ్యాపారులు భారత్‌కు తిరిగి వస్తున్నారని చెప్పారు. హాంకాంగ్‌లో పరిస్థితి మెరుగుపడకుంటే సూరత్‌ డైమండ్‌ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కరోనా వైరస్‌ కలకలంతో వచ్చే నెలలో హాంకాంగ్‌లో జరగనున్న అంతర్జాతీయ జ్యూవెలరీ ఎగ్జిబిషన్‌ రద్దయ్యే అవకాశం ఉందని, ఇదే జరిగితే సూరత్‌లో జ్యూవెలరీ వ్యాపారానికి భారీ షాక్‌ తప్పదని డైమండ్‌ వ్యాపారి ప్రవీణ్‌ నానావతి చెప్పుకొచ్చారు. చైనాకు ముఖద్వారంగా భావించే హాంకాంగ్‌లో ఇప్పటికే 18 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు గుర్తించగా ఓ వ్యక్తి మరణించారని అధికారులు తెలిపారు.

చదవండి : తిరగడానికి దెయ్యాలు కూడా భయపడతాయి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top