అన్ని వయసుల వారికి అనుమతి

SUPREME COURT LIFTS BAN ON ENTRY OF WOMEN IN SABARIMALA TEMPLE - Sakshi

శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

స్త్రీలను రానివ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం: సీజేఐ

మెజారిటీ సభ్యులతో విభేదించిన మహిళా జడ్జి జస్టిస్‌ ఇందు

రివ్యూ పిటిషన్‌ వేస్తామన్న అయ్యప్ప ధర్మసేన

న్యూఢిల్లీ: శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని పక్కనబెడుతూ అన్ని వయసుల స్త్రీలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. రుతుస్రావాన్ని కారణంగా చూపుతూ ప్రస్తుతం 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగానికి విరుద్ధం, అక్రమమని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పులో వెల్లడించింది. ఐదుగురు సభ్యుల బెంచ్‌ 4:1 మెజారిటీతో ఈ తీర్పు చెప్పింది. జస్టిస్‌ మిశ్రాతోపాటు జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్, జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌లు ఆలయంలోకి స్త్రీల ప్రవేశానికి అనుకూలంగా తీర్పునివ్వగా మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా మాత్రం వారితో విభేదించారు.

మతపరమైన ఏ విశ్వాసాలను కొనసాగించాలి, ఏ సంప్రదాయాలను రద్దు చేయాలనేది కోర్టులు నిర్ణయించాల్సిన అంశం కాదని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు. రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశం నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ వచ్చిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించగా.. తాజా తీర్పుపై భిన్న స్పందనలు వెలువడుతున్నాయి. లింగ సమానత్వం కోసం పోరాటంలో ఇదో కీలక విజయమని పలువురు మహిళా సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా, ఈ తీర్పు దురదృష్టకరమని కొన్ని హిందూ భక్త సంఘాలు, అయ్యప్ప భక్తులు పేర్కొంటున్నారు. తీర్పును అమలు చేస్తామని శబరిమల ఆలయ పరిపాలనను చూసుకునే ట్రావన్‌కోర్‌ దేవస్థాన మండలి తెలిపింది.

భక్తిలో వివక్ష చూపలేం: జస్టిస్‌ మిశ్రా
మహిళలకు ప్రవేశంపై శబరిమల ఆలయం పెట్టిన ఆంక్షలు తప్పనిసరి మత సంప్రదాయాలేమీ కాదనీ, మతం అనేది మనిషిని దైవత్వంతో అనుసంధానించే జీవన విధానమని జస్టిస్‌ మిశ్రా తన తీర్పులో పేర్కొన్నారు. భక్తిలో వివక్షను చూపలేమనీ, పురుషాధిక్య విధానాలతో ఆధ్యాత్మికతలో లింగ సమానత్వాన్ని పాటించకుండా ఉండలేమన్నారు. ‘ఆయప్ప భక్తులంతా హిందువులే. వారు ప్రత్యేక వర్గమేమీ కాదు. శరీర ధర్మ కారణాల ముసుగులో మహిళలను అణచివేయడం చట్టబద్ధం కాదు. నైతికత, ఆరోగ్యం తదితర కారణాలతో మహిళలను పూజలు చేయకుండా అడ్డుకోలేం. పురుషులు ఆటోగ్రాఫ్‌లు పెట్టేంత ప్రముఖులు అవుతున్నా మహిళలు సంతకం పెట్టే స్థితిలో కూడా లేరు’ అని అన్నారు. అయ్యప్ప భక్తులు ప్రత్యేక వర్గమన్న దేవస్థానం వాదనను జస్టిస్‌ మిశ్రా తోసిపుచ్చుతూ, ‘అయ్యప్ప భక్తులంటూ ప్రత్యేక వర్గంగా ఎవరూ లేరు. హిందువులెవరైనా శబరిమల ఆలయానికి వెళ్లొచ్చు.

ఈ దేశంలోని ఇతర అయ్యప్ప ఆలయాల్లో మహిళలకు ప్రవేశం ఉంది. శబరిమలలో నిషేధమెందుకు? శబరిమల ఆలయం బహిరంగ ప్రార్థన స్థలమే. అయ్యప్పను పూజించేవారు ప్రత్యేక వర్గమేమీ కాదు’ అని స్పష్టం చేశారు. వచ్చే నెల 2న జస్టిస్‌ మిశ్రా పదవీ విరమణ పొందనుండగా, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన ఇచ్చిన చివరి తీర్పు ఇదే. తనతోపాటు జస్టిస్‌ ఖన్విల్కర్‌ తరఫున కూడా జస్టిస్‌ మిశ్రాయే 95 పేజీల తీర్పును రాశారు. మిగిలిన న్యాయమూర్తులు ఎవరికి వారు తమ తీర్పులు వెలువరించారు. జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ నారిమన్‌లు కూడా జస్టిస్‌ మిశ్రా అభిప్రాయాలతో తమ తీర్పుల్లో ఏకీభవించారు. రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25, 26లకు విరుద్ధమని ఆయన జస్టిస్‌ నారిమన్‌ పేర్కొన్నారు. శబరిమల ఆలయ ప్రవేశం విషయంలో మహిళలపై వివక్ష చూపుతున్న కేరళ హిందూ బహిరంగ ప్రార్థనా స్థలాల నిబంధనలు–1965లోని 3(బి) నిబంధనను కూడా కొట్టేయాలని ఆయన అన్నారు.

అది అంటరానితనమే: జస్టిస్‌ చంద్రచూడ్‌
వయసు, రుతుస్రావం స్థితి ఆధారంగా మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం అంటరానితనం కిందకే వస్తుందని జస్టిస్‌ చంద్రచూడ్‌ తన తీర్పులో పేర్కొన్నారు. అది మహిళ గౌరవానికి భంగం కలిగించడంతోపాటు, పురుషుల కన్నా స్త్రీలు తక్కువనేలా ఉంటుందని అన్నారు. ‘రుతుస్రావం కారణంగా మహిళలు శుభ్రంగా లేరనే కారణం చూపుతూ వారిని గుడిలోకి రానివ్వకపోవడం ఓ రకమైన అంటరానితనమే. రాజ్యాంగంలోని 17వ అధికరణం ప్రకారం అది అక్రమం’ అని చంద్రచూడ్‌ తన 165 పేజీల తీర్పులో పేర్కొన్నారు.

పునః సమీక్ష కోరతాం: అయ్యప్ప ధర్మసేన
సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరమనీ, త్వరలోనే ఈ తీర్పుపై తాము పునఃసమీక్ష కోరతామని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్‌ ఈశ్వర్‌ చెప్పారు. శబరిమల ఆలయ మాజీ పూజారి మనవడైన రాహుల్‌ మాట్లాడుతూ ‘మేం తప్పకుండా సుప్రీంకోర్టులో మా పోరాటం కొనసాగిస్తాం. అక్టోబరు 16 వరకు ఆలయం మూసే ఉంటుంది. కాబట్టి అప్పటివరకు మాకు సమయం ఉంది’ అని వెల్లడించారు. మహిళలు సహా పలువురు భక్తులు కూడా తాము విశ్వాసాలను నమ్ముతామనీ, సుప్రీంకోర్టు తీర్పు విచారకరమన్నారు. శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు తాంత్రి కందరారు రాజీవారు మాట్లాడుతూ తీర్పు తనను నిరాశకు గురిచేసినప్పటికీ, కోర్టు ఆదేశాలను అమలు చేయాలని దేవస్థానం నిర్ణయించిందన్నారు.

తీర్పును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ  స్వాగతించారు. ఇదొక అద్భుత తీర్పు అనీ, హిందూ మతాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని కేరళ మత సంస్థల శాఖ మంత్రి సురేంద్రన్‌ అన్నారు. మహారాష్ట్రలోని శని శింగ్నాపూర్‌ ఆలయంలోకి కూడా మహిళల ప్రవేశం కోసం గతంలో ఉద్యమం చేపట్టిన తృప్తీ దేశాయ్‌ తాజా సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. స్త్రీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు అభించిన విజయంగా ఆమె సుప్రీం తీర్పును అభివర్ణించారు. పురుషాధిక్య, అహంకార ఆలయ పాలక మండలికి ఈ తీర్పు చెంపపెట్టు అన్నారు. త్వరలోనే తాను శబరిమల ఆలయాన్ని సందర్శిస్తానని ఆమె చెప్పారు.

అవి రెండు పరస్పర విరుద్ధ హక్కులు
జస్టిస్‌ ఇందు మల్హోత్రా
దేశంలో లౌకిక వాతావరణం ఉండేలా చేసేందుకు పురాతన విశ్వాసాలను రద్దు చేయాలనుకోవడం సమంజసం కాదని జస్టిస్‌ ఇందు మల్హోత్రా తన తీర్పులో పేర్కొన్నారు. సమానత్వ హక్కు, అయ్యప్ప స్వామిని పూజించడానికి మహిళలకు ఉన్న హక్కు.. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవని ఆమె అన్నారు. ‘ఈ అంశం శబరిమలకే పరిమితంకాదు. ఇతర ఆలయాలపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శబరిమలలో పూజలు చేయడం ఒక మత సంప్రదాయం. దానిని కాపాడాలి. హేతుబద్ధ భావనలను మతపరమైన విషయాల్లోకి తీసుకురాకూడదు.

మత సంప్రదాయాలపై న్యాయసమీక్ష జరగడం సరికాదు. కోర్టులు హేతుబద్ధతను, నైతికతను దేవుణ్ని పూజించే విధానంపై రుద్దలేవు. కొందరిని అనుమతించడం లేదంటే దాని అర్థం వారంతా అంటరానివారని కాదు. ఆలయ సంప్రదాయాలు, నమ్మకాలపై అది ఆధారపడి ఉంటుంది. భారత్‌లో భిన్న మత విధానాలు ఉన్నాయి. ప్రార్థించేందుకు ఉన్న ప్రాథమిక హక్కును సమానత్వ సిద్ధాంతం ఉల్లంఘించజాలదు’ అని ఆమె తన తీర్పులో వెల్లడించారు. సామాజిక రుగ్మతలైన సతీసహగమనం వంటి అంశాల్లో తప్ప, మతపరమైన విశ్వాసాల్ని తొలగించే అధికారం కోర్టులకు లేదని ఆమె అన్నారు.

ఈ ఆలయాల్లోనూ నో ఎంట్రీ
హరియాణలోని కార్తికేయ ఆలయం, రాజస్తాన్‌లోని రణక్‌పూర్‌ గుడి తదితరాల్లోనూ మహిళలను అనుమతించరు. క్రీ.పూ ఐదో శతాబ్దానికి చెందిన కార్తికేయుడి ఆలయం హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా పెహోవాలో ఉంది. కార్తికేయుడు బ్రహ్మచారి. అందుకే ఈ ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే వారిని దేవుడు శపిస్తాడని భక్తుల నమ్మకం. రాజస్తాన్‌లోని పాలి జిల్లాలో ఉన్న జైన ఆలయం రణక్‌పూర్‌ గుడిలోకి మహిళలకు ప్రవేశం లేదు. క్రీ.శ. 15వ శతాబ్దంలో నిర్మాణమైన దేవాలయాల సమూహ ప్రాంతమిది. ఈ ఆలయ సముదాయంలోకి రుతుస్రావం అయ్యే వయసులో ఉన్న మహిళల ప్రవేశం నిషిద్ధం.

అసోంలోని బార్పెటా పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ ఆలయం పట్‌బౌసి సత్రాలోకి రుతుస్రావమయ్యే స్త్రీలు రాకూడదనే నిబంధన ఉంది. 2010లో అప్పటి అసోం గవర్నర్‌ జేబీ పట్నాయక్‌ ఈ ఆలయ అధికారులను ఒప్పించి 20 మంది మహిళలకి ఆలయ ప్రవేశం కల్పించారు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మహిళల్ని అనుమతించినా మళ్లీ నిషేధం విధించారు. తిరువనంతపురంలోని ప్రఖ్యాత పద్మనాభస్వామి ఆలయంలో మహిళలకు ప్రవేశంపై కొన్ని పరిమితులున్నాయి. స్త్రీలు పద్మనాభుడికి పూజలు చేయవచ్చు. కానీ గర్భగుడిలోకి వెళ్లరాదు.

వివాదం ఇలా ప్రారంభం
2006లో జ్యోతిష్కుడు ఒకరు ఆలయంలో దేవప్రశ్నం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఎవరో మహిళ ఆలయంలోకి ప్రవేశించిందన్నారు. వెంటనే కన్నడ నటి, ప్రస్తుత కర్ణాటక మంత్రివర్గంలో సభ్యురాలు జయమాల తాను శబరిమల ఆలయంలోకి వెళ్లి అయ్యప్పస్వామి విగ్రహాన్ని తాకినట్లు చెప్పారు.దీంతో శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశంపై వివాదం ముదిరింది. ఆ తర్వాత మహిళలకు ప్రవేశం నిరాకరణను సవాల్‌ చేస్తూ సీనియర్‌ అడ్వకేట్‌ ఇందిర జైసింగ్‌ ఆధ్వర్యంలో మహిళా లాయర్లు కోర్టుకెక్కారు.

వందల ఏళ్ల సంప్రదాయాల్ని కాదనే హక్కు కోర్టుకి ఉండదనీ, అలాంటి అంశాల్లో పూజారులదే తుది నిర్ణయమంటూ కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పుని లాయర్ల బృందం సుప్రీం కోర్టులో సవాల్‌చేసింది. శబరిమల ఆలయానికి ప్రాముఖ్యత ఉందనీ, ప్రభుత్వాలు, కోర్టులు జోక్యం చేసుకోకూడదని ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వాదించింది. అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచారి, అందుకే రుతుస్రావ వయసులో మహిళల్ని రానివ్వడం లేదని చెప్పింది. దీన్ని మహిళలపై వివక్షగా చూడకూడదంది. హిందూమతంలోని వైవి«ధ్యాన్ని అర్థం చేసుకోలేక పిటిషినర్లు దానిని వివక్షగా చూస్తున్నాయని బోర్డు ఆరోపించింది. కొందరు మహిళా భక్తులు బోర్డుకు మద్దతుగా నిలిచారు.  

శబరిమల కేసు పూర్వాపరాలు...
► 1990: శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశంపై నిషేధాన్ని తొలగించాలంటూ ఎస్‌.మహేంద్రన్‌ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

► 1991, ఏప్రిల్‌ 5: కొన్ని వయస్సుల మహిళలపై తరాలుగా కొనసాగుతున్న నిషేధాన్ని సమర్ధిస్తూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.

►  2006 ఆగస్టు 4: శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ పిటిషన్‌ వేసింది.

► 2007 నవంబర్‌: పిటిషన్‌కు మద్దతుగా కేరళలోని ఎల్డీఎఫ్‌ సర్కారు అఫిడవిట్‌ దాఖలు.

►  2016 ఫిబ్రవరి 6: కేరళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. మతాచారాన్ని పాటించే భక్తుల హక్కును పరిరక్షిస్తామని తెలిపింది.

► 2016 ఏప్రిల్‌ 11: మహిళల ప్రవేశంపై నిషేధం వల్ల స్త్రీ, పురుష సమ న్యాయ భావనకు ప్రమాదం ఏర్పడిందని కోర్టు వ్యాఖ్య.

► 2016 ఏప్రిల్‌ 13: ఆలయ సంప్రదాయం పేరుతో ప్రవేశాలను అడ్డుకోవడంలో హేతుబద్ధత లేదన్న సుప్రీంకోర్టు.

► 2016 ఏప్రిల్‌ 21: మహిళలను అనుమతించాలంటూ హింద్‌ నవోత్థాన ప్రతిష్టాన్, నారాయణాశ్రమ తపోవనమ్‌ పిటిషన్లు.

► 2016 నవంబర్‌ 7: అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలనే వాదనకు మద్దతు తెలుపుతూ కేరళ అఫిడవిట్‌ వేసింది.

► 2017 అక్టోబర్‌ 13: ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top