అక్కడా రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు

Supreme Court Judgment on Appointment of Teachers of Scheduled Areas in Telugu States - Sakshi

తెలుగు రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్‌ ప్రాంతాల టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పు  

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు నూరు శాతం గిరిజనులకు రిజర్వేషన్లు వర్తింపజేయడం చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమంది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు ఇప్పటివరకు జరిగిన నియామకాలకు రక్షణ ఇస్తున్నామని, ఏపీ, తెలంగాణలో ఇదేరీతిలో పునరావృతమైతే ఇప్పటివరకు జరిగిన వాటికి కూడా రక్షణ ఉండదని హెచ్చరించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ చేబ్రోలు లీలాప్రసాదరావు, ఇతరులు 2002లో దాఖలు చేసిన సివిల్‌ అప్పీలును జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి బుధవారం 152 పేజీల తీర్పు వెలువరించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1986లో షెడ్యూల్డు ఏరియాలో ఉపాధ్యాయ నియామకాల్లో వంద శాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబరు 275 జారీచేసింది. 1989లో ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్‌ దాన్ని రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వచ్చింది. సుప్రీం కోర్టు 1998లో దానిని కొట్టివేస్తూ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చి ంది. తిరిగి జనవరి 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది. పరిపాలన ట్రిబ్యునల్‌ దీనిని కొట్టివేయగా, హైకోర్టు జీవోను సమర్థించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌ దాఖలైంది. పిటిషనర్‌ తరపున న్యాయవాది సీఎల్‌ఎన్‌ మోహన్‌రావు వాదనలు వినిపించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపింపచారు. వాటిపై ధర్మాసనం పైవిధంగా తీర్పునిచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top