నిర్భయ దోషులకు ‘సుప్రీం’ నోటీసులు

Supreme Court Issues Notices To Nirbhaya Convicts - Sakshi

కొత్త డెత్‌ వారెంట్‌కి ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం పిటిషన్‌ అడ్డుకాదని స్పష్టం

దిశ ఎన్‌కౌంటర్‌ని ప్రజలు సెలబ్రేట్‌ చేసుకున్నారన్న సొలిసిటర్‌ జనరల్‌ 

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే ఎత్తివేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతిస్పందించాల్సిందిగా సుప్రీంకోర్టు నిర్భయ దోషులకు నోటీసులు జారీచేసింది. అలాగే దోషులకు కొత్తగా డెత్‌ వారెంట్‌ జారీచేసేందుకు ట్రయల్‌ కోర్టుకి వెళ్ళేందుకు పూర్తి అధికారాలను ఇచ్చింది. నిర్భయ దోషుల మరణశిక్ష అమలుకు తేదీలు ఖరారు చేస్తూ ట్రయల్‌ కోర్టు కొత్తగా డెత్‌వారెంట్‌ జారీచేయడానికి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ అడ్డంకి కాదని జస్టిస్‌ ఆర్‌.భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నల ధర్మాసనం తేల్చి చెప్పింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా దోషులకు ఉరిశిక్ష అమలు చేయడం ‘సంతోషం’ కోసం కాదనీ, అధికారులు కేవలం చట్టపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారనీ అన్నారు. ఈ కేసులో వినయ్‌ శర్మ అనే దోషి రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు.

అమలుకు ఇబ్బందులు.. 
2017లో దోషుల అప్పీళ్ళను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసినప్పటికీ ఇంకా అధికారులు ఇప్పటికింకా వాటిని అమలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని తుషార్‌ మెహతా వ్యాఖ్యానించారు. దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై ప్రజలు ఉత్సవంలా జరుపుకున్నారని తుషార్‌  అన్నారు. తొలుత దోషులకు నోటీసులు జారీచేయడం వల్ల శిక్ష అమలులో జాప్యం జరుగుతుందని సుప్రీంకోర్టు భావించింది. అయితే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం కోరడంతో నోటీసులు జారీచేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top