టాలీవుడ్‌లో డ్రగ్స్‌.. సుప్రీం కీలక ఆదేశాలు

Supreme Court Directions to Centre in Drugs in tollywood case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు విధివిధానాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ వినియోగంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా డ్రగ్స్‌ నియంత్రణకు ఉద్దేశించిన విధివిధానాలు రూపొందించేందుకు నాలుగు నెలలు సమయం ఇవ్వాలని కేంద్ర కోరగా.. ఇప్పటివరకు విధివిధానాలు ఎందుకు రూపొందించలేదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆగష్టు 31లోపు విధివిధానాలు రూపొందించాలని కేంద్రానికి సూచించింది. అయితే, ఇందుకోసం కనీసం రెండు నెలల గడువు ఇవ్వాలని కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటరల్ జనరల్ మణిందర్ సింగ్ ధర్మాసనాన్ని కోరారు. విధివిధానాలు రూపొందించడంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) సహకారం ఆలస్యం అవుతుందని సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీచేయాలని పిటీషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోరగా.. విధివిధానాలు రూపొందించిన తరువాత, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసే విషయం గురించి ఆలోచిద్దామని ధర్మాసనం  స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top