ఆ కేసుల్లోకి బంధువులను లాగొద్దు

Supreme court comments on Marital disputes and dowry harassment - Sakshi

     వరకట్న చావులు, భార్యాభర్తల వివాదంపై సుప్రీంకోర్టు 

     నేర నిర్ధారణ జరిగాకే విచారించాలని సూచన 

     ‘హైదరాబాద్‌ మహిళ కేసు’ విచారణలో కీలక వ్యాఖ్యలు 

న్యూఢిల్లీ: నేర నిర్ధారణ జరిగేంత వరకు వరకట్న వేధింపులు తదితర వైవాహిక వివాదాల్లో భర్త కుటుంబ సభ్యులు, బంధువులను నిందితులుగా చేర్చొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో భర్త తరఫు దూరపు బంధువులను విచారించడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని దిగువ స్థాయి కోర్టులకు సూచించింది. 2016 నాటి హైదరాబాద్‌ హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ ఓ వ్యక్తి తల్లి తరఫు బంధువులు దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావుల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. వైవాహిక వివాదంలో తమపై నేర విచారణను రద్దుచేయాలని కోరుతూ వారు దాఖలుచేసుకున్న పిటిషన్‌ను హైదరాబాద్‌ హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘వైవాహిక వివాదాలు, వరకట్న వేధింపులకు సంబంధిం చిన కేసుల్లో భర్త కుటుంబ సభ్యులు, బంధువులను విచారించడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధారణ ఆరోపణలపై ఆధారపడొద్దు. నేరంలో బంధువుల పాత్ర ఉందని నిర్ధారించుకునేంత వరకు వారిని విచారణలో భాగం చేయొద్దు’అని బెంచ్‌ అభిప్రాయపడింది.  

కేసు పూర్వాపరాలివీ
భర్త, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తల్లి తరఫు బంధువులు తనను వేధిస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకును భర్త కిడ్నాప్‌ చేశాడనీ ఆరోపించింది. ఈ కేసులో తమపై విచారణ జరపొద్దని భర్త తరఫు బంధువులు హైదరాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు వారి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కోర్టు తీర్పుతో పోలీసులు చార్జిషీట్లు దాఖలుచేశారు. 2008లో వివాహం చేసుకుని, అమెరికాలో నివాసం ఉంటున్న ఈ జంట మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని, భార్యను నిత్యం మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న భర్తకు ఆయన తల్లి తరఫు బంధువులు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ‘పిటిషనర్లు (భర్త తరఫు బంధువులు).. భార్యను వేధిస్తున్న భర్తకు మద్దతుగా నిలవడం ద్వారా నేరంలో పాలుపంచుకున్నట్లు భావించలేం.

న్యాయ ప్రక్రియ దుర్వినియోగమవుతోందని గుర్తిస్తే తప్ప, విచారణను మధ్య లో నిలిపివేయబోం. న్యాయ పరిరక్షణకు మధ్యలో జోక్యం చేసుకునేందుకు సందేహించం’ అని కోర్టు పేర్కొంది. విచారణ సందర్భంగా బాధితురాలి తరఫు లాయర్‌ వాదిస్తూ..మహిళకు చెందిన కొన్ని పత్రాలను ఆమె భర్త తరఫు బంధువులు లాక్కున్నారని, ఆమె కొడుకును అపహరించి అమెరికా తీసుకెళ్లడానికి భర్త ప్రయత్నించాడని కోర్టుకు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top