వికాస్‌ దూబేకు సాయం.. పోలీస్‌ అధికారిపై వేటు

Station Officer Suspended for Giving Tip Off to Vikas Dubey - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వికాస్‌ దూబే అనే గ్యాంగ్‌స్టర్‌ను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. అయితే పోలీసుల రాక గురించి వికాస్‌ దూబేకు సమాచారం ఇచ్చాడనే అనుమానంతో చౌబేపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి వినయ్‌ తివారీని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం అతడిపై దర్యాప్తు ప్రారంభించారు.  పోలీసులపై దాడిలో వికాస్‌ తివారీ ప్రమేయం ఉన్నట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ అంశాన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తామని.. ఆరోపణలు నిజమయితే వికాస్‌ తివారీపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వికాస్‌తో పాటు ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే గతంలో కూడా వికాస్‌ తివారి ఇలానే ప్రవర్తించాడని.. వికాస్‌ దూబేపై కేసు నమోదు చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. (‘నా కొడుకుని ఎన్‌కౌంటర్‌ చేయండి’)

కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కరడుగట్టిన నేరగాడైన వికాస్‌ దూబేపై 60కి పైగా కేసులున్నాయి. ఈ కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మృతిచెందారు. ఇద్దరు ఎస్‌ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు, మరో పౌరుడు గాయపడ్డారు. మృతిచెందిన, గాయపడిన పోలీసుల వద్ద ఉన్న ఏకే–47, ఇన్సాస్‌ రైఫిల్, గ్లాక్‌ పిస్టల్, రెండు .9 ఎంఎం పిస్టళ్లను వికాస్‌ దూబే అనుచరులు ఎత్తుకెళ్లారు. చనిపోయిన పోలీసులకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం కాన్పూర్‌లో నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top