లంక దాడి ఐసిస్‌ పనే 

Sri Lanka bomb attacks were revenge for New Zealand mosque killings - Sakshi

బాధ్యత ప్రకటించుకున్న ఉగ్రసంస్థ

న్యూజిలాండ్‌లో మసీదుపై దాడులకు ప్రతీకారంగానేఈ పేలుళ్లు: శ్రీలంక మంత్రి

కొలంబో: శ్రీలంకలో గత ఆదివారం, ఈస్టర్‌ పండుగనాడు బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 321కి పెరిగింది. ‘శ్రీలంకలో బాంబు దాడులు చేసినవారు మా కోసం పోరాడేవారే’ అని ఐసిస్‌ అమఖ్‌ అనే వార్తా సంస్థకు తెలిపింది. ఈ అమఖ్‌ వార్తా సంస్థ ఇస్లామిక్‌ రాజ్యస్థాపనకు, ఉగ్రవాదానికి మద్దతు తెలిపేదే. ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాదుల పేర్లను ఐసిస్‌ ప్రకటించింది. ఈ దాడుల్లో గాయపడిన, చనిపోయిన వారి మొత్తం సంఖ్య దాదాపు వేయి అని పేర్కొంది. ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఆరోగ్య మంత్రి రజిత సేనరత్నే మాట్లాడుతూ స్థానిక ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌ ఈ దాడులకు కుట్రపన్నినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడిన వారందరూ శ్రీలంక జాతీయులేననీ, వారికి ఐసిస్‌ లేదా ఏదేనీ ఇతర విదేశీ ఉగ్రవాద సంస్థ మద్దతు ఇచ్చి ఉండొచ్చన్నారు. 

మరో ఇద్దరు భారతీయుల మృతి 
పేలుళ్లలో మృతి చెందిన మరో ఇద్దరు భారతీయుల పేర్లను భారత హై కమిషన్‌ మంగళవారం వెల్లడించింది. ఎ.మోరెగౌడ, హెచ్‌.పుట్టరాజు పేలుళ్లలో మరణించారని తెలిపింది. ఈ పేలుళ్లలో చనిపోయిన మొత్తం భారతీయుల సంఖ్య తాజాగా 10కి చేరింది. 

మొత్తం 40 మంది అరెస్టు 
ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తులు ఉపయోగించిన వ్యాన్‌కు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిని సహా మొత్తం 40 మంది అనుమానితులను శ్రీలంక పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. గత 24 గంటల్లో 16 మందిని అరెస్టు చేశామని పోలీసు విభాగం అధికార ప్రతినిధి రువాన్‌ గుణశేఖర మంగళవారం చెప్పారు.  మరోవైపు దేశ భద్రతను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత మహిందా రాజపక్స నిందించారు. 

మసీదుపై దాడికి ప్రతీకారంగానే
గత నెల 15న న్యూజిలాండ్‌లో మసీదుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 50 మంది మృతికి కారణమవ్వడం తెలిసిందే. ఆ దాడికి ప్రతీకారంగానే స్థానిక ఇస్లాం తీవ్రవాదులు శ్రీలంకలో ఈస్టర్‌ నాడు బాంబు దాడులు చేశారని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువాన్‌ విజెవర్ధనే మంగళవారం పార్లమెంటుకు చెప్పారు. విజెవర్ధనే మాట్లాడుతూ ‘ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ దాడి క్రైస్ట్‌చర్చ్‌ కాల్పులకు ప్రతీకారంగానే జరిగింది’ అని అన్నారు. 

ఆత్మాహుతి దాడిలో ఇద్దరు ముస్లింలు 
శ్రీలంకలో ఆత్మాహుతి దాడికి దిగినవారిలో ఇద్దరు ముస్లిం సోదరులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిద్దరూ కొలంబోకి చెందిన ఓ మసాలా దినుసుల వ్యాపారి కొడుకులని చెప్పారు. ఒకరు షాంగ్రీ లా హోటల్‌లో, మరొకరు సిన్నమన్‌ గ్రాండ్‌ హోటల్‌లో ఆత్మాహుతికి పాల్పడ్డారు. శ్రీలంకలో ఉగ్రవాదుల బాంబు దాడుల్లో హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో నివసించే మాకినేని శ్రీనివాసబాబు అనే వ్యక్తి గాయపడ్డారు. ఉగ్రవాదుల బాంబు వీరికి సమీపంలో పేలడంతో శ్రీనివాసబాబుకు తీవ్రగాయాలయ్యాయి. అయితే, ఆయనతోపాటు వెళ్లిన మరో వ్యక్తి మృతి చెందినట్టు తెలిసింది. 

వైఫల్యానికి ప్రభుత్వం సారీ
దాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినా పేలుళ్లను అడ్డుకోలేకపోవడంపై శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. దాడులకు ముందే తమకు హెచ్చరికలు అందాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి రజిత సేనరత్నే చెప్పారు. ‘మేం హెచ్చరికలను పరిశీలించాం. అయినా తగిన విధంగా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం మీకు క్షమాపణ చెబుతోంది. బాధితులుగా మిగిలిన కుటుంబాలు, సంస్థలను ప్రభుత్వం క్షమాపణలు వేడుకుంటోంది’ అని ఆయన చెప్పారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తామనీ, చర్చిలను పునఃనిర్మిస్తామని తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top