నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 23 మంది మృతి | 23 people died in suspected suicide attacks in north-eastern Nigeria | Sakshi
Sakshi News home page

నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 23 మంది మృతి

Mar 18 2026 5:48 AM | Updated on Mar 18 2026 5:48 AM

23 people died in suspected suicide attacks in north-eastern Nigeria

మరో 108 మందికి గాయాలు

మైదుగురి: నైజీరియాలోని ఈశాన్య నగరం మైదుగురి సోమవారం రాత్రి ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఈ ఘటనల్లో కనీసం 23 మంది చనిపోగా, మరో 108 మంది గాయాలపాలయ్యారు. బోర్నో రాష్ట్ర రాజధాని అయిన మైదుగురిలోని బోధనాస్పత్రి ప్రధాన ద్వారం వద్ద రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించింది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్, వ్యాపార కూడలి అయిన పోస్టాఫీస్‌ వద్ద వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ మూడు ఘటనలను ఆత్మాహుతి దాడులుగా అనుమానిస్తున్నట్లు బోర్నో పోలీసు విభాగం ప్రతినిధి కెన్నెత్‌ తెలిపారు.

వీటికి బాధ్యత వహిస్తున్నట్లు ఎవరూ ప్రకటించుకోలేదు. అయితే, జిహాదీ గ్రూపు బోకో హరామ్‌పైనే అనుమానాలున్నాయి. మైదుగురి నగర శివార్లలో తీవ్రవాదుల దాడులను సైన్యం తిప్పికొట్టిన 24 గంటల వ్యవధిలోనే ఆత్మాహుతి దాడులు చోటుచేసుకోవడంపై ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో షరియా నిబంధనలను అమలు చేయాలంటూ ఈ గ్రూపు 2009 నుంచి హింసాత్మక ఘటనలకు దిగుతోంది. ఐఎస్‌ తదితర గ్రూపులను కలుపుకుని, వేలాది మంది సాయుధులు కలిగిన బోకో హరామ్‌ అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇటీవలి కాలంలో ఈ గ్రూపు సైనిక స్థావరాలపై దాడులు తీవ్రతరం చేసింది. పలువురు ఉన్నతాధికారులను, సైనికులను చంపడంతోపాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని లూటీ చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement