‘డాక్టర్ మెడిసిన్ లీక్ కరేగా’ కోడ్‌తో..

‘డాక్టర్ మెడిసిన్ లీక్ కరేగా’ కోడ్‌తో.. - Sakshi


♦ కర్ణాటకలో ఆరుగురి అరెస్ట్

♦ ఏకే 47లు, పేలుడు పదార్థాలు స్వాధీనం

 

 సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసిన ఎన్‌ఐఏ అధికారులు ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అందులో బెంగళూరుకు చెందిన వారు నలుగురు, మంగళూరు, తుమకూరులకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఈనెల మొదటి వారంలో బెంగళూరుకు చెందిన మౌల్వీ ఖాస్మీని ఎన్‌ఐఏ బృందం అరెస్టు చేసింది. అతని నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం దాడులు నిర్వహించింది. బెంగళూరుకు చెందిన అహ్మద్ అఫ్జల్, మహమ్మద్ సోహైల్, హసీఫ్, అహ్మద్‌లతో పాటు తుమకూరుకు చెందిన సయ్యద్ ముజాహిద్దీన్, మంగళూరుకు చెందిన నజ్మల్ హుదాలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు ఏకే-47లను, భారీగా పేలుడు పదార్థాలు,  మ్యాపులను స్వాధీనం చేసుకున్నారు. భారీ దాడులకు కుట్ర

 మంగళూరుకు చెందిన నజ్మల్ హుదా తప్ప మిగతా ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు విచారించగా... గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించేందుకు కుట్రపన్నినట్లు తెలిసింది. వారంతా ‘డాక్టర్ మెడిసిన్ లీక్ కరేగా’ కోడ్‌తో సంప్రదింపులు, కార్యకలాపాలు సాగించేవారని తేలింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, ఫోన్లలో సమాచారాన్ని పరిశీలించగా... మైసూరులో సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రావడానికి ముందు మైసూరుకు దగ్గర్లోని మాండ్యా నుంచి పాకిస్తాన్‌కు ఓ ఫోన్‌కాల్ వెళ్లినట్లు తేలింది. అధికారులు అరెస్టు చేసినవారిలో బెంగళూరులోని సారాయిపుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అఫ్జల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మహ్మద్ సోహైల్ ఇక్కడి కాటన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

 

 ఆరు రాష్ట్రాల్లో 14 మంది అరెస్ట్: ఎన్‌ఐఏ

 ఉగ్రవాద దాడులకు కుట్ర జరుగుతోందన్న సమాచారంతో శుక్రవారం ఆరు రాష్ట్రాల్లోని 12 చోట్ల దాడులు చేశామని ఎన్‌ఐఏ ప్రకటించింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, తుమకూరు, మంగళూరు, ముంబై, లక్నోల్లో జరిపిన దాడుల్లో 14 మందిని అదుపులోకి తీసుకుని... ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. శుక్రవారం అరెస్టు చేసిన వారిలో ముంబైకి చెందిన ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ నఫీస్‌ఖాన్, మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్, మంగళూరుకు చెందిన హుడా, బెంగళూరుకు చెందిన అఫ్జల్ తదితరులు ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top