పాక్‌లో సిక్కు యువతి మత మార్పిడి!

Sikh Girl Forcibly Converted To Islam To Marry Muslim Man - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో మైనార్టీ వర్గమైన సిక్కు పూజారి కుమార్తె ఒకరు ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బలవంతంగా పెళ్లి చేసి మత మార్పిడి చేశారని యువతి కుటుంబీకులు ఆరోపిస్తుండగా, అలాంటిదేమీ లేదని, తన ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నాననీ ఆ యువతి చెప్తున్న వీడియో బయటికి రావడం సంచలనం రేపింది. ఈ ఘటనపై భారత్‌లో ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో పాకిస్తాన్‌ విచారణకు ఆదేశించింది.

తమ కుమార్తె జగ్జీత్‌ కౌర్‌ గత మూడు రోజులుగా కనిపించడం లేదని లాహోర్‌లోని నంకనా సాహెబ్‌లోని సిక్కు పూజారి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం ఆ యువతి వీడియో ఒకటి బయటికొచ్చింది. అందులో తన పేరు జగ్జీత్‌ కౌర్‌ అనీ, తాను ఇష్ట ప్రకారమే ముస్లిం యువకుడిని వివాహం చేసుకున్నానని.. ఇందులో ఎవరి బలవంతం లేదని ఆ యువతి చెప్పుకొచ్చింది. వీడియోలో ముస్లిం భర్త ఆమె పక్కనే ఉన్నారు. ఈ మేరకు యువతి వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో పాకిస్తాన్‌లోని మైనార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పంజాబ్‌ (పాకిస్తాన్‌) ముఖ్యమంత్రి సర్దార్‌ ఉస్మాన్‌ బుజ్డార్‌ స్పందించి విచారణకు ఆదేశించారు.

మరోవైపు ఈ ఘటనపై పంజాబ్‌ (భారత్‌) ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కోరారు. అలాగే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఈ వీడియోను ట్వీట్‌ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని  కోరారు. గత మార్చిలో సింధు ప్రావిన్స్‌లో ఇద్దరు హిందూ మైనర్‌ బాలికలను అపహరించి ముస్లిం యువకులతో బలవంతంగా పెళ్లి చేశారు. ఆ ఘటనపై నాటి విదేశాంగ మంత్రి, దివంగత నేత సుష్మాస్వరాజ్‌ చొరవ తీసుకొని నిష్పాక్షిక విచారణ జరిపించాలని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రిని కోరారు. బాలికల కుటుంబీకులు కోర్టులో కేసు వేసినప్పటికీ తీర్పు వారికి ప్రతికూలంగా వచ్చింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కశ్మీర్‌ అంశంపై ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పర్యవసానాలు ఎలా ఉంటాయోనని ఇరు దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top