కంటోన్మెంట్‌లో శశికళ ట్యాక్స్‌ డిఫాల్టర్‌!

కంటోన్మెంట్‌లో శశికళ ట్యాక్స్‌ డిఫాల్టర్‌! - Sakshi


రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని వైనం

హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో ట్యాక్స్‌ డిఫాల్టర్‌! మారేడ్‌పల్లి రాధిక కాలనీలో శశికళ నటరాజన్‌ పేరిట ఉన్న ప్లాట్‌ నెంబర్‌ 16లోని ఇంటికి సంబంధించి రెండేళ్లకు రూ. 35,424 ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం బకాయిల వసూలు లక్ష్యంగా కంటోన్మెంట్‌ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు నోటీసులు పంపిన కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు, శశికళ పేరిట ఉన్న ఇంటికీ నోటీసు పంపారు. 1990 ప్రాంతంలో జయలలిత నగర శివారులోని జీడిమెట్ల గ్రామపరిధిలో జేజే గార్డెన్‌ పేరిట వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన సమయంలోనే, మారేడ్‌పల్లిలో శశికళ పేరిట ఇళ్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.



అప్పట్లో తరచూ హైదరాబాద్‌కు వచ్చే సమయాల్లో జయలలిత ఇక్కడ నివాసం ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏ–2గా సుప్రీం కోర్టు శశికళను దోషిగా తేల్చిన సందర్భంలో ఆమె పేరిట నగరంలో ఉన్న ఆస్తుల వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. కొంతకాలం క్రితం ప్రైవేటు వ్యక్తులు ఆ ఇంట్లో అద్దెకు ఉండేవారని, నాలుగేళ్లుగా సదరు నివాసం ఖాళీగానే ఉంటోందని స్థానికులు అంటున్నారు. మొత్తానికి కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని ఆమె ఆస్తి అక్రమమా లేక సక్రమమా అనే చర్చ మొదలైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top