ధారావిలో కరోనా కేసుల తగ్గుముఖం

Sharp Drop In New Coronavirus Cases in Dharavi - Sakshi

ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇరుకైన వీధులు, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఒకే గదిలో పది నుంచి ఇరవై మంది వరకూ నివసించే ధారావిలో వైరస్‌ వ్యాప్తి కలకలం రేపింది. భౌతిక దూరం పాటించడానికి అతికష్టమైన భౌగోళిక పరిస్థితులు కలిగిన ఇరుకైన ప్రాంతమైన ధారవిలో వ్యక్తుల కాంటాక్టుల జాడ పట్టుకోవడం కూడా చాలా కష్టమైన పని. అయితే గురువారం నమోదైన 25 కేసులతో పోలిస్తే శుక్రవారం తక్కువగా కేవలం 5కేసులు మాత్రమే కొత్తగా నమోదయ్యాయి. పదిలక్షల మందికి పైగా నివసించే ఈ ప్రాంతంలో కోవిడ్‌-19 రోగుల సంఖ్య 220కి చేరుకోగా, ఇప్పటి వరకు 14 మంది మృతిచెందారు.

ముంబై పురపాలక సంస్థ నుంచి కమ్యూనిటీ హెల్త్‌ కేర్‌ కార్మికులు, వైద్య బృందాలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ధారావిలో కోవిడ్‌–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మురికివాడపై ప్రత్యేక దృష్టి సారించారు. శరవేగంగా భారీ స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించడం, కొత్త ఐసోలేషన్, వైద్య మౌలిక వ్యవస్థలను సిద్ధం చేసి కరోనా కట్టడి కోసం రేయింబవళ్లు తీవ్ర కృషి చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. ప్రజలను తమ ఇళ్లలోనే ఉండేలా క్వారంటైన్‌ చేయడం, వారి రోజువారీ రేషన్‌ సరుకులను ఉచితంగా అందించడం అనేది ఏకకాలంలోనే కొనసాగిస్తున్నారు. నగరంలోని వ్యాపార వర్గాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విరాళాల ద్వారా మునిసిపల్‌  కార్పొరేషన్‌ దీన్ని నిర్వహిస్తోంది. ఐసోలేట్‌ చేసిన అన్ని ఇళ్లకూ బియ్యం బస్తాలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఆయిల్‌ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. పలువురు ఎన్జీవోలకు చెందిన వారు కూడా ప్రజలకు ఆహారం అందిస్తున్నారు. 150 మంది కార్మికులతో కూడిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రోజూ చెత్త ఏరివేయడం, ఇళ్లలో, రూముల్లో, భవనాల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా క్రిమిసంహారక మందులను స్ప్రే చేయడం, మురికికాలువలను క్లీన్‌గా ఉంచడం వంటి విధులను నిర్వహిస్తున్నారు.

తొలి కరోనా వైరస్‌ బాధితుడు మృతి చెందగానే మహారాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు చేపట్టడంతోనే కొంత మేర సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే కరోనా కేసులు పూర్తిగా తగ్గే వరకు ధారావిలో కట్టుదిట్టమైన చర్యలు కొనసాగించాలని లేకపోతే వైరస్‌ వ్యాప్తి సులువుగా పెరిగే అవకాశం  ఉందని అధికారులు చెబుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top