భారతీయ ముస్లింలకు నష్టం జరగదు: షాహి ఇమామ్‌

Shahi Imam Says Nothing To Do With Indian Muslims Over CAA - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని సహా వివిధ రాష్ట్రాల్లో నిరసనలు పెల్లుబుకుతున్న వేళ ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్‌ సయ్యద్‌ అహ్మద్‌ బుఖారి కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం భారత్‌లో నివసిస్తున్న ముస్లింలకు ఎటువంటి నష్టం చేయదని పేర్కొన్నారు. అది కేవలం ముస్లిం శరణార్థులకు ఇచ్చే పౌరసత్వానికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) గురించి సయ్యద్‌ మంగళవారం మీడియాతో మట్లాడారు.

‘నిరసన తెలపడం అనేది భారత ప్రజలకు ఉన్న ప్రజాస్వామ్యపు హక్కు. మనకు నచ్చని అంశంపై నిరసన తెలియజేయడాన్ని ఎవరూ ఆపలేరు. అయితే అది శాంతియుతంగా జరగాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్నార్సీకి చాలా తేడా ఉంది. ఎన్నార్సీ ఇంకా చట్టరూపం దాల్చలేదు. ఇక పౌరసత్వ సవరణ చట్టం అనేది... పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే ముస్లిం శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే వ్యతిరేకం. భారతీయ ముస్లింలకు దాంతో ఎటువంటి నష్టం జరగదు’ అని పేర్కొన్నారు.

అదే విధంగా జామియా యూనివర్సిటీ రణరంగంగా మారిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలని సయ్యద్‌ విఙ్ఞప్తి చేశారు. కాగా పార్లమెంటు ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top