'సంక్షోభంలో పాఠశాలలు' | School dropout biggest crisis in India, says Singapore deputy PM Shanmugaratnam | Sakshi
Sakshi News home page

'సంక్షోభంలో పాఠశాలలు'

Aug 27 2016 2:18 PM | Updated on Sep 4 2017 11:10 AM

భారత్‌లో పాఠశాలలు సంక్షోభంలో చిక్కుకున్నాయని సింగపూర్ ఉప ప్రధాని షణ్ముగరత్నం అన్నారు.

న్యూఢిల్లీ: భారత్‌లో పాఠశాలలు సంక్షోభంలో చిక్కుకున్నాయని సింగపూర్ ఉప ప్రధాని తర్మన్ షణ్ముగరత్నం అన్నారు. శుక్రవారం జరిగిన నీతి ఆయోగ్ కార్యక్రమం ‘ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’లో ఆయన తొలి ప్రసంగం చేశారు. పిల్లలు తొందరగా స్కూలుకెళ్లడం ప్రారంభించడం ఉపయోగకరమని అధ్యయనాల్లో తేలిందని చెప్పారు. ఐసీడీఎస్, అంగన్‌వాడీ రూపంలో భారత్‌లో రెండు మంచి పథకాలున్నాయని కొనియాడారు. గ్రామ స్థాయిలో తల్లి, పిల్లలకు తదుపరి స్కూలుకు చేరువయ్యేందుకు చేపట్టే సత్వర చర్యలు కీలకం అవుతాయని పేర్కొన్నారు.

‘ భారత్‌లో స్కూళ్లు సంక్షోభంలో ఉన్నాయి. ఈ సమస్య ఈనాటిది కాదు. భారత్, తూర్పు ఆసియా దేశాలకు మధ్యనున్న ప్రధాన అంతరం పాఠశాలల నిర్వహణే. ఈ లోపాలు ఎంతమాత్రం సమర్థనీయం కావు. అప్పర్ ప్రైమరీ విద్య పూర్తికాక ముందే 43 శాతం మంది స్కూలును వదిలేస్తున్నారు. 7 లక్షల ప్రైమరీ స్కూలు ఉపాధ్యాయుల కొరత నెలకొంది. కేవలం 53 శాతం పాఠశాలల్లోనే బాలికలకు మరుగుదొడ్లున్నాయి. 74 శాతం వాటికే తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉంది’ అని తన వద్దనున్న దత్తాంశాన్ని చదివి వినిపించారు. 2009లో ఓఈసీడీ పీసా 74 దేశాల్లో జరిపిన అధ్యయనంలో భారత్ 73వ స్థానంలో నిలిచిన సంగతిని గుర్తుచేశారు.

ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివి ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలను నడుపుతున్న ప్రతిభావంతులున్న దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. భారత్‌లో నైపుణ్యాల్లో భారీ అంతరాలున్నాయని చెప్పారు. అగ్రభాగాన అధిక ప్రతిభావంతులు ఉన్నారని, సమాజంలోని మిగతా వర్గాల్లో అరకొర శక్తిసామర్థ్యాలున్నాయని అన్నారు. బడ్జెట్ పెంపుతో ఈ సమస్యలను పరిష్కరించలేమని, నిర్వహణ, పని సంస్కృతితోనే ఇది సాధ్యమవుతుందని సూచించారు. ప్రపంచంలో దేశాలన్నీ గ్రాడ్యుయేట్లను అవసరానికి మించి తయారుచేస్తున్నాయని, వారికి బాహ్య ప్రపంచ సంబంధ నైపుణ్యాలు, పరిజ్ఞానం కొరవడుతున్నాయని షణ్ముగరత్నం ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement