
న్యూఢిల్లీ : మాజీ గవర్నర్ ఎన్డీ తివారి తనయుడు రోహిత్ హత్య కేసులో అతని భార్య అపూర్వ శుక్లా ప్రస్తుతం తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆస్తి కోసం తానే భర్తను చంపినట్లు అపూర్వ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే జైలులో ఆమె ప్రవర్తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు జైలు సిబ్బంది. చేసిన నేరం పట్ల ఆమె ఏ మాత్రం పశ్చత్తాపం వ్యక్తం చేయడం లేదని తెలిపారు. అంతేకాక ప్రస్తుతం ఆమె జాతకాలు చెప్పడం నేర్చుకుంటుందన్నారు. జైలులో వారానికి రెండు సార్లు మంగళవారం, గురువారం రోజుకు రెండు గంటల పాటు టారోట్ కార్డ్ రీడింగ్(జాతకాల గురించి) క్లాసులు జరుగుతాయని తెలిపారు అధికారులు.
అపూర్వ ప్రత్యేక శ్రద్ధతో ఈ కోర్సును నేర్చుకుంటుందన్నారు జైలు అధికారులు. మొదటి వరుసలో కూర్చుని.. ఎంతో ఏకాగ్రతతో పాఠాలు వింటుందని తెలిపారు. అంతేకాక ఈ కోర్సు పట్ల ఆమె ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారని ప్రశంసించారు. గతంలో కోర్టు విచారణ సందర్భంగా ఓ క్లాస్ మిస్సయ్యిందని.. అందుకు ఆమె ఎంతో బాధపడిందని తెలిపారు అధికారులు.