లాలూ కుమారుడికి ఊరట

Relief for Tej Pratap Yadav - Sakshi

న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, బిహార్‌ మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బిహార్‌లో సంచలనం సృష్టించిన జర్నలిస్టు హత్యకు సంబంధించిన కేసులో ఆయనపై తదుపరి విచారణ అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, మహ్మద్‌ కైఫ్‌, మహ్మద్‌ జావేద్‌లకు సంబంధించి.. పత్రికల్లో వచ్చిన ఫొటోలు, వీడియోల నుంచి ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అన్న కోణంలో విచారించారా అని సీబీఐని కోర్టు ప్రశ్నించింది. ఇందుకు తగిన ఆధారాలు సంపాదించలేకపోయామని సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణకు తేజ్‌ప్రతాప్‌ రావాల్సిన అవసరంలేదని గురువారం స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో మహ్మద్‌ కైఫ్‌, మహ్మద్‌ జావేద్‌ ఇంకా జ్యుడిషియల్‌ కస్టడీలోనే ఉన్నారు.

అసలు ఏం జరిగింది...
బిహార్‌ ప్రాంతీయ దినపత్రికకు చెందిన రాజ్‌దేవ్‌ రాజన్‌ సివాన్‌ పట్టణంలో 2016,మే 13న హత్యకు గురయ్యారు. జైలు పాలైన ఆర్జేడీ నేతకు చెందిన గన్‌మెన్లు ఈ హత్య చేశారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. రాజ్‌దేవ్‌ భార్య కూడా తేజ్‌ప్రతాప్‌ను విచారించాలని కోరడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. బిహార్‌లో అప్పట్లో సంచలనం సృష్టించిన చంద్ర​కేశ్వర్‌ ప్రసాద్‌ కుమారుల హత్యకేసుకు సంబంధించి రాజ్‌దేవ్‌ వార్తలు రాశారు. ఈ విషయమై తేజ్‌ప్రతాప్‌.. రాజ్‌దేవ్‌ను బెదిరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజ్‌దేవ్‌ హత్య కేసులో ఆర్జేడీ నేత, గ్యాంగ్‌స్టర్‌ షహబుద్దీన్‌ కీలక సూత్రధారి అని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించినా ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును పోలీసులు చేర్చలేదు. షహబుద్దీన్‌కు మరో కేసులో కోర్టు ఇప్పటికే జీవిత ఖైదు విధించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top