పునరావాసమే సవాల్‌! | Sakshi
Sakshi News home page

పునరావాసమే సవాల్‌!

Published Tue, Aug 21 2018 2:31 AM

Rehabilitation likely the biggest challenge post floods - Sakshi

తిరువనంతపురం/కొచ్చి: వర్షాలు తెరిపివ్వడంతో కేరళలో వరద ఉధృతి తగ్గినా కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. లక్షల మంది నిరాశ్రయులకు పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడం సవాల్‌గా మారింది. తిండి, నీరు, తాత్కాలిక ఆశ్రయం కల్పించడంతోపాటు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం, అధికారుల ముందు అతిపెద్ద సమస్యగా నిలిచింది. వరదల కారణంగా మృతుల సంఖ్య 376కు చేరింది. 5,645 పునరావాస కేంద్రాల్లో 7.24 లక్షల మంది నిరాశ్రయులున్నారు. మరోవైపు, పలుప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గకపోవడంతో నీటిలో చిక్కుకున్న వారిని కాపాడే కార్యక్రమాలు సాగుతున్నాయని సదరన్‌ కమాండ్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఆర్‌ సోనీ పేర్కొన్నారు.

డ్రోన్ల ద్వారా ఇంకెవరు చిక్కుకుని ఉన్నారనే విషయం తెలుసుకుని.. ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ‘అందరినీ కాపాడి పూర్తి పునరావాసం కల్పించడంపైనే దృష్టిపెట్టాం’ అని ఆయన తెలిపారు. సహాయక బృందాలకు అవసరమైన కనీస సదుపాయాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్లు దాదాపుగా ముగిసినట్లేనని వైస్‌ అడ్మిరల్‌ గిరీశ్‌ లుథారా పేర్కొన్నారు. అక్కడక్కడ చిక్కుకుని ఉన్నవారిని గుర్తించామని వారిని కాపాడేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

సహాయక చర్యలు ముమ్మరం
ఇళ్లపైకప్పుల పైన, మిద్దెల పైన నిలబడి సాయం కోసం అర్థిస్తున్నారు. ఎవరైనా రాకపోతారా.. కాపాడకపోతారా అనే ఆశతో తిండితిప్పల్లేకుండా ఆశగా ఎదురుచూస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని శాటిలైట్‌ ఫోన్ల ద్వారా చేరుకుంటున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఎర్నాకులం జిల్లా పరూర్‌లో ఆదివారం రాత్రి ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీడీ సతీశన్‌ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న దాదాపు అందరినీ క్షేమంగా పునరావాస కేంద్రాలకు పంపించినట్లు ఆయన వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లలో పేరుకుపోయిన బురద, రాళ్లురప్పలు తొలగించే పనులు కూడా ఊపందుకున్నాయి. ఈ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతోపాటు విద్యుత్‌ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నారు.

నేవల్‌ ఎయిర్‌బేస్, కొచ్చి పోర్టు ద్వారా..
కొచ్చి నేవల్‌ ఎయిర్‌బేస్‌లో వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. బెంగళూరునుంచి సరుకులతో వచ్చిన విమానం సోమవారం ఉదయం ఎయిర్‌బేస్‌లో ల్యాండైంది. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 26వరకు విమానాల రాకపోకలకు అవకాశం లేకపోవడంతో.. కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాలనుంచి సహాయసామాగ్రి కోసం ఈ ఎయిర్‌బేస్‌నే వినియోగించనున్నారు. మరోవైపు, కేరళ పోర్టుకు కూడా వివిధ రాష్ట్రాలనుంచి సముద్రమార్గం ద్వారా సహాయ సామగ్రి రవాణా మొదలైంది. ముంబై నుంచి 800 టన్నుల స్వచ్ఛమైన నీరు, 18 టన్నుల సరుకుతో నేవల్‌షిప్‌ ఐఎన్‌ఎస్‌ దీపక్‌ చేరుకుందని కొచ్చి పోర్టు ట్రస్టు అధికారులు తెలిపారు. పోర్టునుంచే పునరావాస కేంద్రాలకు ట్రక్కుల్లో ఈ సామగ్రిని పంపిస్తున్నారు.

మరోవైపు, కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరో భారీ సరుకుల నౌక వల్లార్‌పదం పోర్టుకు చేరుకుంది. మరోవైపు, ముంబై నుంచి భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)కు చెందిన భారీ నౌకలో 50వేల మెట్రిక్‌ టన్నుల ఇంధనం కూడా కొచ్చి పోర్టుకు చేరుకుంది. సహాయక కార్యక్రమాలు, ట్రక్కుల కోసం భారీగా ఇంధనం అవసరమైన నేపథ్యంలో బీపీసీఎల్‌ ఈ నౌకను పంపించింది. అటు, తిరువనంతపురం, ఎర్నాకులం మధ్య రైలు సేవలను పునరుద్ధరిస్తున్నారు. ట్రయల్‌రన్‌ తర్వాత సహాయకసామగ్రిని తరలించేందుకు ఈ ట్రాక్‌ కీలకంగా ఉపయోగపడుతుంది. మరోవైపు, తిరువనంతపురం నుంచి చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీలకు రైలు సేవలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి.  

సాయం అందుతోంది!
వరదకోరల్లో చిక్కుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం రూ.3కోట్లు, అస్సాం ప్రభుత్వం రూ.3కోట్ల సాయం అందిస్తున్నట్లు ప్రకటించాయి. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. అటు, రూ.10 కోట్ల సాయం అందించిన ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 2,500 టన్నుల బియ్యాన్ని ప్రత్యేక రైల్లో కేరళకు పంపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా 100 మెట్రిక్‌ టన్నుల ధాన్యాలు, 52 మెట్రిక్‌ టన్నుల అత్యవసర మందులను సోమవారం కేరళకు పంపించింది. దీంతోపాటుగా 2,600 మెగావాట్ల విద్యుత్‌ను అందించేందుకు అంగీకారం తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్సీఎమ్సీ) కేరళలో వరద పరిస్థితి, అందుతున్న సాయంపై సమీక్ష నిర్వహించింది.  

తలచుకుంటేనే భయమేస్తోంది: బాధితులు
అటు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారు కూడా భవిష్యత్తును తలచుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరిగి ఇళ్లకు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తలచుకుంటేనే ఒళ్లుగగుర్పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వరదలకు ముందుపరిస్థితి నెలకొనడం ఎలాగనేదే పెద్ద సమస్యంటున్నారు. ‘మళ్లీ ఇళ్లకు వెళ్లాక మా పరిస్థితేంటో అర్థం కావడం లేదు. సర్వం నష్టపోయాం.

మా ఇళ్లను కట్టుకునేందుకు తగినంత సాయంకావాలి’ అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పునరావాస కేంద్రాల్లోనూ పరిస్థితి ఒకేలా లేదు. చాలాచోట్ల కనీస వసతులు కూడా ఇంకా ఏర్పాటుచేయలేదు. ఎర్నాకులంలోని ఓ కేంద్రంలో ఓ చిన్నారికి తట్టు (చికెన్‌ పాక్స్‌) సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆ చిన్నారికి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ప్రత్యేక ఏర్పాట్లతో చికిత్సనందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చల్లేందుకు అవసరమైన బ్లీచింగ్‌ పౌడర్‌ కొరత కారణంగా మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.  

రండి.. కాపాడుకుందాం: కేంద్రం పిలుపు
వరదలతో అతలాకుతలమైన కేరళ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలు, బడా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ‘విషాదకరమైన మానవత్వ సంక్షోభం’లో ఉన్న కేరళను ఆదుకునేందుకు తోచినంత సాయం చేయాలని కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు విజ్ఞప్తి చేశారు. సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయదలచుకోవడం లేదని.. సహాయం చేయడం, చేసేవారిని కలుపుకుని వెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం పారిశ్రామికవేత్తలు, సీఐఐ, ఫిక్కీ వంటి వ్యాపార సంస్థలు తదితరులతో అధికారులు మాట్లాడుతున్నారన్నారు. అటు కేరళనుంచి వివిధ ప్రాంతాలకు విమానచార్జీలు పెంచుతున్నట్లు సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి స్పందిస్తూ.. విమానయాన కంపెనీలు మానవతాధృక్పథంతో వ్యవహరించాలన్నారు. అటు, కేరళ సాధారణస్థితికి చేరుకునేందుకు వందలు, వేల సంఖ్యలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు అవసరమని మరో కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్‌ అన్నారు.

జాతీయవిపత్తుగా గుర్తించబోం: కేంద్రం
న్యూఢిల్లీ: కేరళలో వరద విలయాన్ని తీవ్రమైన విపత్తుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ‘కేరళలో వరదల తీవ్రత, కొండచరియలు విరిగిపడిన ఘటనలను, జరిగిన అపార నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా గుర్తించాం’ అని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రకృతి ప్రకోపాన్ని అరుదైన/తీవ్రమైన విపత్తుగా గుర్తించినపుడు రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయస్థాయిలో సహాయం అందుతుంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధి నుంచి అదనపు సాయంపై  కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య 3:1 నిష్పత్తితో విపత్తు సహాయ నిధి (సీఆర్‌ఎఫ్‌)ను ఏర్పాటుచేస్తారు.

ఈ నిధిలో డబ్బులు తగ్గినపుడు నేషనల్‌ కెలామిటీ కంటిన్‌జెన్సీఫండ్‌ (100%కేంద్ర నిధులు) నుంచి సాయం అందిస్తారు. తీవ్రమైన విపత్తు ప్రకటించిన ప్రాంతాల్లో బాధితుల రుణాల చెల్లింపులో వెసులుబాటు, కొత్త రుణాలు ఇచ్చే అవకాశాన్ని చూస్తారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించబోమని కేరళ హైకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం ఈ విషయం తెలిపింది. ‘కేరళ విపత్తు తీవ్రమైనది. జాతీయ విపత్తు నిర్వహణ నిబంధనల ఆధారంగా దీన్ని లెవల్‌ 3 విపత్తుగా గుర్తించాం. ఎంత పెద్ద విపత్తు ఎదురైనా ఈ నిబంధనల ఆధారంగానే కేటగిరీలు నిర్ణయిస్తాం. కేరళ వరదల విలయాన్ని జాతీయ విపత్తుగా గుర్తించబోవడం లేదు’ అని పేర్కొంది.  

తగ్గిన కర్ణాటక వరదలు
కర్ణాటకలోని కొడగు జిల్లాలో నాలుగురోజులుగా బీభత్సం సృష్టించిన వరద తగ్గుముఖం పట్టింది. జిల్లాలోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో పర్యాటకుల బుకింగ్స్‌ను రద్దుచేసి నిరాశ్రయులకు గదులు కేటాయించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, సైన్యం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఒక్కో కుటుంబానికి రూ.3,800 చొప్పున మధ్యంతర సహాయం అందించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు.


అలువా జిల్లాలో అంటువ్యాధులు సోకకుండా మందుల పంపిణీ


కొచ్చి ఆడిటోరియంలో బాధితుల కోసం సహాయ సామగ్రిని సిద్ధం చేస్తున్న వాలంటీర్లు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement