రాజ్యసభ ఎన్నికలు: కాంగ్రెస్- బీజేపీ చెరో 2 | Rajya Sabha Elections Congress Won 2 From Rajasthan BJP Won 2 From MP | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఎన్నికలు: కాంగ్రెస్- బీజేపీ చెరో 2

Jun 19 2020 7:55 PM | Updated on Jun 19 2020 11:20 PM

Rajya Sabha Elections Congress Won 2 From Rajasthan BJP Won 2 From MP - Sakshi

రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌ రెండు స్థానాలు దక్కించుకోగా.. బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ఇక మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే రిపీట్‌ అయింది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని 19 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌటింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకు 11 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య జరిగిన రసవత్తర పోరులో.. రెండు పార్టీలు సమఉజ్జీగా నిలిచాయి. రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌ రెండు స్థానాలు దక్కించుకోగా.. బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ఇక మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే రిపీట్‌ అయింది. అధికార బీజేపీ రెండు స్థానాల్లో, కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజయం సాధించింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన కేసీ వేణుగోపాల్‌, నీరజ్‌ దండి, బీజేపీ నుంచి రాజేంద్ర గెహ్లాట్‌ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, సమర్‌ సింగ్‌ సోలంకి, కాంగ్రెస్‌ నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ విజయంసాధించారు.
(చదవండి: ఓటేసేందుకు అంబులెన్స్‌లో వచ్చిన ఎమ్మెల్యే)

ఇక ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. మేఘాలయా నుంచి అధికార నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) అభ్యర్థి డాక్టర్‌ డబ్ల్యూఆర్‌ ఖర్లుఖీ విజయం సాధించారు. మిజోరాం నుంచి అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అభ్యర్థి కె.వాన్లాల్వేనా విజయం సాధించారు. జార్ఖండ్‌ నుంచి బీజేపీ, జార్ఖండ్‌ ముక్తి మోర్చా చెరో స్థానంలో విజయం సాధించాయి. గుజరాత్‌లో మూడు రాజ్యసభ స్థానాలను బీజేపీ గెలిచింది. ఒక స్థానంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇక మణిపూర్ ఫలితాలు రావాల్సి ఉంది. 
(చదవండి: అఖిలపక్ష భేటీలో వరుస ప్రశ్నలు సంధించిన సోనియా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement