ఎన్‌ఎస్‌జీ పేరు వింటే ఉగ్రవాదులకు దడ 

Rajnath Singh Says NSG Can Counter Any Attack - Sakshi

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 

కమాండోలు ఏ తరహా దాడులనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలరు  

ఇబ్రహీంపట్నంలో స్పెషల్‌ కాంపోజిట్‌ గ్రూప్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం  

సాక్షి, రంగారెడ్డి జిల్లా : జాతీయ భద్రతా దళాల(ఎన్‌ఎస్‌జీ) పేరు వింటే ఉగ్రవాదుల గుండెల్లో గుబులు పుడుతుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. దేశంపై కన్నెత్తి చూసే టెర్రరిస్టులకు ఎన్‌ఎస్‌జీ సుదర్శన చక్రంలా కనిపిస్తుందని అన్నారు. అన్ని బలగాల్లోకెల్లా ఎన్‌ఎస్‌జీ కమాండోలు అత్యుత్తమమని కొనియాడారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో వాటిపాత్ర చాలా గొప్పదని ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోబానగర్‌లో రూ.157.84 కోట్ల వ్యయంతో 200 ఎకరాల్లో నిర్మించిన 28వ స్పెషల్‌ కంపోజిట్‌ గ్రూప్‌(ఎస్‌సీజీ) భవన సముదాయాన్ని మంగళవారం రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభించారు.

గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, ఎన్‌ఎస్‌జీ డైరెక్టర్‌ జనరల్‌ సుదీప్‌ లక్టాకియా, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉగ్రవాదం ప్రపంచ నలుమూలలకు పాకిందని, సామాజిక మాధ్యమాల్లోనూ కొత్త సవాళ్లను విసురుతోందని రాజ్‌నాథ్‌ అన్నారు. ఈ తరహా సవాళ్లను సైతం అధిగమించేందుకు సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దేశంలో విధ్వంసాలు సృష్టించేందుకు పొరుగు దేశం ప్రయత్నిస్తోందని పాకిస్తాన్‌ను ఉద్దేశించి అన్నారు. 2008లో ముంబైలో టెర్రరిస్టులు చేసిన దాడుల నేపథ్యంలో బలగాలు ప్రతిచర్యకు దిగే సమయాన్ని వీలైనంతగా తగ్గించాలన్న ఉద్దేశంతో ఎస్‌సీజీ రీజినల్‌ హబ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం భావించిందన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతాలో స్థాపించినట్లు వివరించారు.

ముంబై, అక్షరధామం, పఠాన్‌కోట్‌ దాడులు తీవ్ర నష్టం కలిగించాయని, అలాంటి ఘటనలను భారతీయులు మర్చిపోలేరని చెప్పారు. ప్రముఖులకు రక్షణ కల్పించడంతోపాటు ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించడంలో ఎన్‌ఎస్‌జీల పాత్రను అభినందించారు. ఆ దళాలు చేపట్టే ఎటువంటి కార్యక్రమాల్లోనైనా పాల్గొనడాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎలాంటి భద్రతా బలగాలైనా ఎన్‌ఎస్‌జీ తరహాలో ధైర్యసాహసాలు, నైపుణ్యాలను కలిగి ఉండాలన్నారు. వచ్చే సంవత్సరంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్న 16 మంది సభ్యులతో కూడిన ఎన్‌ఎస్‌జీ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఉగ్రమూకలను మట్టుబెట్టడంలో ఎన్‌ఎస్‌జీలు కీలకంగా పనిచేస్తున్నాయని ఎన్‌ఎస్‌జీ డీజీ సుదీప్‌ లక్టాకియా అన్నారు. ఎన్‌ఎస్‌జీలు తన శక్తియుక్తులను ఇనుమడింప చేసుకొనే ప్రయత్నాల్లో భాగంగా ఫ్రాన్స్, యూఎస్‌ఏలతో కలసి విన్యాసాలను నిర్వహించిందని తెలిపారు. ధైర్యానికి, త్యాగానికి, నైపుణ్యాలకు ఎన్‌ఎస్‌జీలు ప్రతీకలని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్‌సీజీ ఏర్పాటవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అంతకుముందు స్పెషల్‌ కంపోజిట్‌ కాంప్లెక్స్‌లో శిక్షణలో భాగంగా నేర్చుకున్న విన్యాసాలను ఎన్‌ఎస్‌జీ బ్లాక్‌క్యాట్‌ కమాండోలు ప్రదర్శించారు. కేంద్ర హోంమంత్రి తదితరులు వీటిని వీక్షించి కమాండోల ధైర్యసాహసాలను ప్రశంసించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top