పోలీస్‌ అమరవీరులకు ఘన నివాళి

Rajnath Singh at Police Commemoration Day parade at Police Memorial Ground - Sakshi

దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం

అమరుల సేవలు గుర్తు చేసుకుంటూ నివాళులు

సాక్షి, న్యూఢిల్లీ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరులకు హోంమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని పోలీస్ మెమోరియల్‌ గ్రౌండ్‌లోని స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాలను దేశం మరిచిపోదని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, కర్నాటక సహా ఇతర రాష్ట్రాల్లోనూ పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా జరిగింది. ఆయా ముఖ్యమంత్రులు పరేడ్‌లో పాల్గొన్ని అమర పోలీసులకు అంజలి ఘటించారు.

పోలీస్‌ కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: కేసీఆర్‌
హైదరాబాద్‌ : విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్‌ అమరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళి అర్పించారు. అమరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధులకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పోలీస్‌ కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసులు నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్నారన్నారు. రూ.వెయ్యికోట్లతో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను బలోపేతం చేస్తామని తెలిపారు. మహిళా భద్రత కోసం షీ టీమ్స్‌, కల్తీని నివారించేందుకు స్పెషల్‌ టీంలతో తనిఖీలు చేపట్టనున్నట్లు నాయిని పేర్కొన్నారు. గోషామహల్‌ లో జరిగిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌ శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండ: చినరాజప్ప
విజయవాడ: పోలీస్ అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శనివారం విజయవాడలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మాట్లాడుతూ... సంఘ విద్రోహ శక్తులనుంచి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారన్నారు. అలాగే పోలీస్‌శాఖలో సాంకేతికత వినియోగించి మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. పోలీసులను కుటుంబ సభ్యుడిగా ప్రజలు భావించాలని, సమాజ క్షేమం కోసం పోలీసుల త్యాగం వెల కట్టలేనిదని చినరాజప్ప పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top