మహిళలపై యాసిడ్ దాడులు పెరిగిపోతుండటంతో ఈ కేసులను క్రూరమైన కేసుల కిందకు తీసుకురావడానికి కేంద్రం కసరత్తుచేస్తోంది.
న్యూఢిల్లీ: మహిళలపై యాసిడ్ దాడులు పెరిగిపోతుండటంతో ఈ కేసులను క్రూరమైన కేసుల కిందకు తీసుకురావడానికి కేంద్రం కసరత్తుచేస్తోంది. ఈ కేసుల విచారణకు నిర్దిష్ట సమయాన్ని విధించి, బాధితులకు త్వరితగతిన న్యాయాన్ని అందించాలని యోచిస్తోంది.
క్రూరమైన కేసుల కేటగిరీ కిందకు తెస్తే యాసిడ్ దాడులకూ గరిష్టంగా యావజ్జీవ కారాగారం లేదా మరణదండన విధించే అవకాశముంటుందని హోం శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. నేర న్యాయచట్టం (సవరణ)-2013 ప్రకారం యాసిడ్ దాడి కేసులో దోషిగా రుజువైతే పదేళ్ల జైలు శిక్ష లేదా యావజ్జీవం పడుతుంది. ఈ కేసుల విచారణను 60 రోజుల్లోగా పూర్తిచేయాలి. యాసిడ్ దాడుల నియంత్రణకు చట్టపరంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిర్ణయం తీసుకున్నారని అందులో పేర్కొన్నారు.