
మోదీపై రాహుల్ సెటైర్లు..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో తాను ఎన్నడూ ముచ్చటించలేదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోదీ సైతం తనతో మాట్లాడలేదని, ఆయన కేవలం హలో అని మాత్రమే అంటారని చెప్పుకొచ్చారు. తన గురించి మోదీ చేసే వ్యాఖ్యలన్నీ తనపై ఆయనకున్న ద్వేషం, కోపం నుంచి పుట్టుకొస్తాయని వ్యాఖ్యానించారు. తాను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాననే సత్యాన్ని అంగీకరిస్తానని అన్నారు.
తమ కుటుంబంలో జరిగిన విషాద ఘట్టాలను మోదీ గుర్తించలేరని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై నాయనమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీల హింసాత్మక మరణాల ప్రభావాన్ని మోదీ చూడలేరని దుయ్యబట్టారు. ఆ బాధ నుంచి తాము బయటపడిన తీరును, నేర్చుకున్న పాఠాలను మోదీ గుర్తించకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 11 నుంచి గల్ఫ్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.