
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, ముంబై : పాలక బీజేపీపై భావసారూప్యత కలిగిన పార్టీలతో మహాకూటమి ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం విపక్షాలకు పిలుపు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలకు వ్యతిరేకంగా విపక్ష పార్టీల మహాకూటమి ఏర్పాటు రాజకీయ నాయకుల సెంటిమెంట్ మాత్రమే కాదని, ఇది ప్రజల ఆకాంక్ష అని రాహుల్ స్పష్టం చేశారు. ప్రజల కోరిక మేరకు ఈ దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించిందని అన్నారు. ‘బీజేపీ, ఆరెస్సెస్, ప్రధాని నరేంద్ర మోదీలను ఢీకొనేందుకు మహాకూటమి ఏర్పాటు కేవలం రాజకీయ నాయకుల కోరిక మాత్రమే కాదు...ఇది ప్రజల ఆకాంక్ష’ అని ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ, బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తూ కీలక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న క్రమంలో దీన్ని ఎలా నివారించాలనే ప్రశ్న ప్రజల్లో ఉదయిస్తోందని చెప్పుకొచ్చారు. పెరుగుతున్న పెట్రో ధరలపై కూడా రాహుల్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని విపక్షాలు కోరుతున్నా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదన్నారు.
నోట్లరద్దు ద్వారా చిన్న వ్యాపారులు, పరిశ్రమలు, వర్తకులపై భారీ దాడి జరిగిందన్నారు. గబ్బర్‌సింగ్ ట్యాక్స్(జీఎస్టీ)తో ముంబైలోని తోలు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. గత యూపీఏ హయాంలో ముడిచమురు బ్యారెల్ ధర 130 డాలర్లు ఉంటే ప్రస్తుతం 70 డాలర్లకు తగ్గినా పెట్రో ధరలు మాత్రం భగ్గుమంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ముడిచమురు ధరలు తగ్గినా వాటి ప్రయోజనాన్ని సామాన్య పౌరులకు మోదీ ప్రభుత్వం బదలాయించలేదన్నారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతోందని ప్రశ్నిస్తూ ఇదంతా కేవలం 15 నుంచి 20 మంది సంపన్న పారిశ్రామికవేత్తల జేబుల్లోకి వెళుతోందని ఆరోపించారు. మహారాష్ట్రలో రాహుల్ పర్యటన రెండు రోజుల పాటు సాగనుంది. ఆయన మంగళవారం ఆరెస్సెస్ కార్యకర్త దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించి భివాండి కోర్టులో విచారణకు హాజరైన విషయం తెలిసిందే.