అవి కాంగ్రెస్‌ విలువలకు విరుద్ధమన్న రాహుల్‌..

Rahul Responds Over CP joshis Casteist Remark On PM Modi   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హిందుత్వం గురించి బ్రాహ్మణులకు మాత్రమే తెలుసని, దీనిపై వారే మాట్లాడగలరని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సీపీ జోషీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ విభేదించారు. కాంగ్రెస్‌ పార్టీ విలువలకు జోషీ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఏ వర్గం మనోభావాలు దెబ్బతినే ప్రకటనలకు పార్టీ నేతలు దూరంగా ఉండాలని సూచించారు. జోషీ తన పొరపాటును గుర్తించి పార్టీ సిద్ధాంతాలను గుర్తెరుగుతారని ఆశిస్తున్నానన్నారు. ఆయన తన ‍ప్రకటనపై విచారం వెలిబుచ్చాలని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

ప్రధాని మోదీని ఉద్దేశించి జోషీ చేసిన వ్యాఖ్యల వీడియో దుమారం రేపిన సంగతి తెలిసిందే. దేశంలో హిందుత్వ గురించి మాట్లాడుతున్న ఉమా భారతి, సాధ్వి రితంబర ఏ కులానికి చెందిన వారో తెలుసా అంటూ ఈ వీడియోలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ దేశంలో మతం గురించి ఎవరికైనా తెలుసంటే వారు పండిట్లు, బ్రాహ్మణులు మాత్రమేనన్నారు.

లోధి అయిన ఉమాభారతి, మరోవైపు ప్రధాని మోదీ హిందుత్వం గురించి మాట్లాడటాన్ని ఆయన ఆక్షేపిస్తూ మతం, పాలన వేర్వేరు అంశాలని వ్యాఖ్యానించారు. వారి మతాన్ని అనుసరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. రాజస్ధాన్‌లోని నద్వారాలో జరిగిన ఓ కార్యక్రమంలో జోషీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్‌లో డిసెంబర్‌ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top