వైరల్‌: అమ్మాయిల వేషధారణలో అబ్బాయిలు

Pune College Boys Dress Up In Sarees On Traditional Day About Gender Equality - Sakshi

పుణే : పుణేలోని పెర్గూసన్‌ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు వారి కాలేజీలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలో చీరలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లింగ సమానత్వం గురించి ఒక సందేశాన్ని చెప్పడానికే ఈ వేషధారణను ఎంచుకొన్నామని ఆ విద్యార్థులు చెబుతున్నారు.వివరాల్లోకి వెళితే.. పెర్గూసన్‌ కాలేజీలో ప్రతీ సంవత్సరం నిర్వహించే వార్షిక వేడుకల్లో ఏదో ఒక థీమ్‌ను ఎంచుకొని విద్యార్థులు ఆ వస్త్రధారణలో వస్తుంటారు. అయితే ఈ ఏడాది 'టై అండ్‌ శారీ డే' పేరుతో థీమ్‌ను ఎంచుకొని కాలేజీ యాజమాన్యం వేడుకలను నిర్వహించింది.

కాలేజీలోని విద్యార్థులందరు వారికి నచ్చిన వస్త్రధారణలో వచ్చారు. అయితే అదే కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న ఆకాశ్‌ పవార్‌, సుమిత్ హోన్వాడజ్కర్, రుషికేష్‌ సనాప్‌లు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి చీరలు ధరించి ఆడవాళ్లలాగా తయారై కాలేజీకి వచ్చారు. అయితే వారి వేషధారణను చూసి మొదట అందరూ నవ్వుకున్న అసలు విషయం తెలిసిన తర్వాత వారితో ఫోటోలు దిగేందుకు ఎగబడడం విశేషం. ఇదే విషయమై వారి ముగ్గురిని కదిలించగా.. ఆకాశ్‌ పవార్‌ స్పందిస్తూ.. 'ఆడవారు చీరలు, సల్వార్‌, కుర్తాలు ధరించాలని, మగవారు షర్ట్‌, ప్యాంట్‌ మాత్రమే వేసుకోవాలని ఎవరు ఎక్కడా చెప్పలేదు. అందుకే ఈసారి వినూత్నంగా ప్రయత్నించాలనే చీరలు కట్టుకొని వెళ్లాం. అంతేకాదు లింగ సమానత్వం గురించి చెప్పాలని అనుకున్నామని' పేర్కొన్నాడు. (ఆరు పదుల వయసులో.. ఆకట్టుకునే డ్యాన్స్‌..!)

'నేను చీరను ధరించేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. చీర కట్టుకునే సమయంలో ప్రతీసారి అది జారిపడుతుండడంతో ఇక లాభం లేదనుకొని మా స్నేహితురాలు శ్రద్దా సాయం తీసుకున్నాం. ఆమె మాకు చీర ఎలా కట్టుకోవాలో చూపించినప్పుడు అది ఎంత కష్టమైనదో తెలిసింది. అంతేకాదు ఆడవాళ్లు మేకప్‌కు ఎందుకంత సమయం తీసుకుంటారో నాకు ఇప్పుడర్థమయింది' అంటూ సుమిత్‌ చెప్పుకొచ్చాడు. 'చీరను ధరించి నడిచేటప్పుడు మాకు చాలా కష్టంగా అనిపించింది. మా ఫ్రెండ్‌ శ్రద్దాకు థ్యాంక్స్‌ చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆమె మాకు సహాయం చేయకుంటే ఇలా రెడీ అయ్యేవాళ్లం కాదని' రుషికేష్‌ వెల్లడించాడు. అయితే వీరు చేసిన సాహసానికి కాలేజీ యాజమాన్యం వీరిని ప్రశంసించింది. లింగ వివక్ష లేకుండా అందరూ సమానమేనని వీరిచ్చిన సందేశానికి కాలేజీ యాజమాన్యంతో పాటు విద్యార్థులు, చూసిన ప్రతీ ఒక్కరు వారిని మెచ్చుకుంటున్నారు.
(వైరల్‌: పిల్లికి కుర్చీ అందించిన పెద్దాయన)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top