‘పుల్వామా’ సూత్రధారి హతం

Pulwama terror attack mastermind killed in encounter in Jammu - Sakshi

కశ్మీర్‌లోని త్రాల్‌లో ఎన్‌కౌంటర్‌

మరో ఉగ్రవాదినీ మట్టుబెట్టిన భద్రతా బలగాలు

శ్రీనగర్‌: పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను బలిగొన్న పుల్వామా దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఉగ్రవాది ముదాసిర్‌ అహ్మద్‌ ఖాన్‌ను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో సోమవారం మట్టుపెట్టాయి. ఈ ఘటనలో మరణించిన మరో ఉగ్రవాదిని పుల్వామా దాడిలో వాడిన మినీ వ్యానును కొనుగోలు చేసిన సజ్జద్‌ భట్‌ అని భావిస్తున్నారు. పుల్వామా జిల్లా పింగ్లిష్‌లో ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌ సోమవారం వేకువజాము వరకు సాగింది. ఉగ్రవాదులు దాక్కున్న ఇంట్లో లభ్యమైన సామగ్రి, ఆధారాల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అందజేస్తామని కశ్మీర్‌ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌..
పింగ్లిష్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రం నుంచే భద్రతా బలగాలు అక్కడ సోదాలు ముమ్మరం చేశాయి. తొలుత ముష్కరులు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుదీర్ఘంగా కొనసాగిన ఎన్‌కౌంటర్‌ ముగిసిన తరువాత సంఘటనా స్థలంలో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించారు. అందులో ఒకరు పుల్వామా మాస్టర్‌మైండ్‌ ముదాసిర్‌ అహ్మద్‌ ఖాన్‌ కాగా, రెండో వ్యక్తి వివరాలు స్పష్టంగా తెలియరాలేదు. అతడిని పుల్వామా దాడికి 10 రోజుల ముందే, ఆ వాహనాన్ని కొనుగోలు చేసిన సజ్జద్‌ భట్‌గా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో ఉగ్రవాదిగా భావిస్తున్న సజ్జద్‌ భట్‌ వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని, అతడు పాకిస్తానీయుడు అని భావిస్తున్నట్లు కశ్మీర్‌ రేంజ్‌ ఐజీ స్వయం ప్రకాశ్‌ పాణి చెప్పారు.

ఎలక్ట్రీ్టషియన్‌ నుంచి ఉగ్రవాదిగా
పుల్వామా నివాసి అయిన 23 ఏళ్ల ముదాసిర్‌ అహ్మద్‌ ఖాన్‌ డిగ్రీ పూర్తిచేసి ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు. 2017లో జైషేలో సాధారణ కార్యకర్తగా చేరి తరువాత నూర్‌ మహ్మద్‌ తంత్రాయ్‌ ప్రేరణతో ఉగ్రవాదిగా మారాడు. అదే ఏడాది డిసెంబర్‌లో తంత్రాయ్‌ హతమయ్యాక 2018 జనవరిలో ఇంటి నుంచి పరారై క్రియాశీలకంగా మారాడు. 2018, ఫిబ్రవరిలో ఆరుగురు భద్రతా సిబ్బందిని బలితీసుకున్న సుంజవాన్‌ ఆర్మీపై దాడిలో అతని పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు నెల రోజుల ముందు ఐదుగురు సీఆర్‌పీఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన లీత్‌పురా దాడిలోనూ అతని ప్రమేయం ఉన్నట్లు తెలిసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top