ప్రఙ్ఞా సింగ్‌కు చేదు అనుభవం

Pragya Thakur Faces Bitter Experience She Vows Legal Action - Sakshi

భోపాల్‌: బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్‌ ఠాకూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ధర్నా చేస్తున్న విద్యార్థినులతో మాట్లాడేందుకు వెళ్లగా.. వెనక్కివెళ్లి పోవాలంటూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మఖన్‌లాల్‌ చతుర్వేది నేషనల్‌ యూనివర్సిటీలో జరిగింది. వివరాలు.... తమకు అటెండన్స్‌ తక్కువగా ఉందంటూ జర్నలిజం విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. శ్రేయా పాండే, మను శర్మ అనే విద్యార్థుల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన.. ప్రఙ్ఞా సింగ్‌ విద్యార్థులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అక్కడికి చేరుకుని.. ‘ఉగ్రవాది వెనక్కి వెళ్లిపో’ అంటూ ప్రఙ్ఞా ను ఉద్దేశించి నినాదాలు చేశారు. దీంతో బీజేపీ మద్దతుదారులు సైతం వీరికి దీటుగా బదులివ్వడం మొదలుపెట్టారు. 

ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు. విద్యార్థులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇక ఈ విషయం గురించి ప్రఙ్ఞా మాట్లాడుతూ.. ఉగ్రవాది అని వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా 2008 మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రఙ్ఞా సింగ్‌ బీజేపీ తరఫున ఎన్నికల బరిలో దిగి భోపాల్‌ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా సాధ్వి ప్రఙ్ఞా సింగ్‌ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. మాలేగావ్‌ పేలుళ్ల కేసులో తనను విచారించిన ఏటీఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే.. తన శాపం కారణంగానే ఉగ్రకాల్పుల్లో మరణించారని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జాతిపిత మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నిజమైన దేశభక్తుడిగా అభివర్ణించారు. దీంతో ప్రతిపక్షాలతో సహా సొంత పార్టీ నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తాయి. (స్పైస్‌జెట్‌ సిబ్బంది దురుసు ప్రవర్తన; ప్రగ్యా ఫిర్యాదు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top