ప్రఙ్ఞాసింగ్‌కు షాకిచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధం!

MP Govt To Reopen Old Murder Case In Which Pragya Thakur Was Cleared - Sakshi

భోపాల్‌ : బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌ ఠాకూర్‌కు షాకిచ్చేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రఙ్ఞాసింగ్‌ నిందితురాలిగా ఉన్న ఆరెస్సెస్‌ ప్రచారక్‌ హత్యకేసును రీఓపెన్‌ చేసేందుకు కమల్‌నాథ్‌ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దాదాపు 12 ఏళ్ల క్రితం అనగా 2007, డిసెంబరు 29న సునీల్‌ జోషి అనే ఆరెస్సెస్‌ ప్రచారక్‌ దారుణ హత్యకు గురయ్యారు. కాంగ్రెస్‌ నాయకుడి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌ జోషి.. అరెస్టు నుంచి తప్పించుకునే క్రమంలో దుండగులు ఆయనను కాల్చి చంపారు. ఈ క్రమంలో ప్రఙ్ఞా సింగ్‌ సహా మరో ఏడుగురికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లభించని కారణంగా 2017లో కోర్టు వీరిని నిర్దోషులుగా తేల్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసును తిరగదోడాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల నేపథ్యంలో భోపాల్‌లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని వెల్లడైన నేపథ్యంలో కమల్‌నాథ్‌ ప్రభుత్వం పాత కేసును తెరపైకి తేవడం గమనార్హం.

ఈ విషయం గురించి రాష్ట్ర న్యాయశాఖా మంత్రి పీసీ శర్మ మాట్లాడుతూ.. సునీల్‌ జోషి హత్య కేసును తిరిగి ఓపెన్‌ చేసేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కేసు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఈ కేసులో దేవాస్‌ కలెక్టర్‌ తన సొంత నిర్ణయాల మేరకు కేసును మూసి వేశారని, ఉన్నత న్యాయస్థానానికి వెళ్లకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసు ఫైల్‌ను సమర్పించాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించామని తెలిపారు.

రివేంజ్‌ పాలిటిక్స్‌..
సునీల్‌ జోషి హత్యకేసు తిరగదోడటంపై బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్‌ అగర్వాల్‌ స్పందించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌పై ప్రఙ్ఞా పోటీ చేసినందుకు ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు. కమల్‌నాథ్‌ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాగా ప్రఙ్ఞాసింగ్‌ ఠాకూర్‌ భోపాల్‌ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆమె 2008 మాలేగావ్‌ పేలుళ్ల కేసులో కూడా నిందితురాలిగా ఉన్నారు. తాజాగా మహత్మా గాంధీ హంతకుడు గాడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించి సొంత పార్టీ నుంచి సైతం విమర్శలు ఎదుర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top