
బెంగాల్ నవ్వుతోంది..
'బెంగాల్ నవ్వుతోంది. బెంగాల్ ఆదర్శరాష్ట్రం. బీజేపీ కుళ్లుతో నిండిన మతతత్వ పార్టీ. బెంగాల్ ను అవమానించొద్దు'
న్యూఢిల్లీ: పేరుకు బీజేపీ వర్సెస్ మహాకూటమే అయినా రాజకీయ పరిభాషలో 'కేంద్రం వర్సెస్ రాష్ట్రం'గా సాగాయి మొన్నటి బిహార్ అసెంబ్లీ ఎన్నికలు. అప్పుడు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు ప్రచారం చేసినా బిహార్ లో బీజేపీ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కూడా మరోసారి 'కేంద్రం వర్సెస్ రాష్ట్రం' తరహాలోనే ఉంటాయన్నది విశ్లేషకుల అంచనా. ఆ అంచనాలకు సాక్షమే శని, ఆదివారాల్లో దేశరాజధాని ఢిల్లీ నగరంలో వెలసిన పోస్ట్లర్లు.
'బెంగాల్ నవ్వుతోంది. బెంగాల్ ఆదర్శరాష్ట్రం. బీజేపీ కుళ్లుతో నిండిన మతతత్వ పార్టీ. బెంగాల్ ను అవమానించొద్దు' అనే సందేశంతో ఢిల్లీ నగరమంతటా కనిపిస్తున్న పోస్టర్లను బెంగాల్ ఫ్రెండ్స్ అసోసియేష్ వారు ముద్రించారు. పోస్టర్ల ఏర్పాటుపై కేంద్ర మంత్రి, బీజేపీ బెంగాల్ వ్యవహారాల ఇన్ చార్జి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ ఓటమి భయంతోనే తృనమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ప్రచారానికి తెరలేపిందని విమర్శించారు. ఇదంతా చూసి 'మనింట్లో పెళ్లికి పక్కింటిముందు పందిరేసినట్లు.. ఎక్కడో బెంగాల్ లో ఎన్నికలైతే ఢిల్లీలో ప్రచారం ఏంటట?'అని సణుగుతున్నారు రాజకీయం తెలియని కొందరు సాధారణ పౌరులు.