‘ఒకే ఒక్కడి’ చుట్టూ మహా రాజకీయాలు

Politics Around A Only One Man - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వర్ధమాన నాయకుడు ప్రకాష్‌ అంబేడ్కర్‌కు మంచి పేరుంది. కచ్చితమైన ఎజెండా ఉంది. ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలోని ప్రగతిశీల బృందాలకు భవిష్యత్‌ జ్యోతిగా ఎదుగుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు ఇటు భారతీయ జనతా పార్టీ, అటు కాంగ్రెస్‌ పార్టీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ప్రకాష్‌ అంబేడ్కర్‌ నాయకత్వంలోని భారిపా బహుజన్‌ మహాసంఘ్‌తోని పొత్తు కుదుర్చుకున్నట్లు  ‘అఖిల భారత మజ్లీస్‌ ఏ ఇత్తెహాదుల్‌ ముస్లీమీన్‌’కు చెందిన ఔరంగాబాద్‌ ఎమ్మెల్యే ఇంతియాజ్‌ జలీల్‌ జలీల్‌ ప్రకటించడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఔననిగానీ, కాదనిగానీ ప్రకాష్‌ అంబేడ్కర్‌ చెప్పకపోవడం పట్ల ఆయన పట్ల ఆశావహ దృక్పథంతో ఉన్న పార్టీలు కలవర పడుతున్నాయి. మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌ గ్రామంలో గత జనవరి ఒకటవ తేదీన జరిగిన మహా దళితుల సభ, పర్యవసానంగా జరిగిన అల్లర్ల కారణంగా ప్రకాష్‌ అంబేడ్కర్‌ వర్ధమాన నాయకుడిగా ఆవిర్భవించారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు జనవరి రెండవ తేదీన మహారాష్ట్ర బంద్‌ సంపూర్ణంగా విజయవంతం అయింది.

ఆయన ఇంతవరకు కాంగ్రెస్‌–ఎన్‌సీపీ కూటమికి, బీజేపీ–ఆరెస్సెస్‌ కూటమికి సమాన దూరంలో ఉంటూ వస్తున్నారు. వామపక్ష పార్టీలే ఆయనకు అంతో ఇంతో దగ్గరగా ఉంటూ వచ్చాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యాల వల్ల నష్టపోయినట్లు భావిస్తున్నా అన్ని దళిత, ఓబీసీ వర్గాలను ఏకం చేయడంలో కూడా ప్రకాష్‌ అంబేడ్కర్‌ విజయం సాధించారు. ఆ గ్రూపులన్నింటితో కలసి ‘వంచిత్‌ బహుజన్‌ అఘాది’ని ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో గతంలో బీజేపీకి మద్దతిచ్చిన మహారాష్ట్ర ముస్లిం సంఘ్‌ కూడా బేషరతుగా అంబేడ్కర్‌కు మద్దతు ప్రకటించింది. జమాత్‌ ఏ ఇస్లామీ కూడా ఆయనతో కలసి పనిచేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీని మట్టి కరిపించాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్‌–ఎన్‌సీపీ ఇప్పటికే ప్రకాష్‌ అంబేడ్కర్‌ వైపు చేతులు చాచినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే అసదుద్దీన్‌ ఓవైసీకి చెందిన ముస్లిం పార్టీ పొత్తు ప్రకటన చేసింది. మత ప్రాతిపదిక రాజీకయాలను నెరపే అసదుద్దీన్‌ వల్ల బీజేపీ మరింత బలపడుతుందేమో అన్నది అంబేడ్కర్‌ వెంట నడుస్తున్న పార్టీలకు కాస్త భయాందోళనలకు గురి చేస్తోంది. 

ఆయనలో మార్పు రావచ్చు!
‘మేము ప్రకాష్‌ అంబీడ్కర్‌తో కలసి పనిచేశాం. ఆయన ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తి. భూమిలేని నిరుపేదల  హక్కుల కోసం పనిచేసే గుణం ఆయనది. అసదుద్దీన్‌ ప్రతిపాదనను ఆయన తర్వాతనైనా తిరస్కవచ్చు’ అని సీపీఐ నాయకుడు ప్రకాష్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల లక్ష్యం ఈ సారి ఒక్కటే, అదే బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయడమని ఆయన అన్నారు. ఓవైసీ రెచ్చగొట్టే ప్రసంగాలు కొంత వరకు నష్టం చేయవచ్చేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందుకనే అంబేడ్కర్‌ తన వైఖరిని మార్చుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. ఒకవేళ మార్చుకోకపోతే సీపీఐ వైఖరి ఎలా ఉంటుందని, ఓవైసీ కలుపుకొనే ఎన్నికలకు వెళతారా? అని మీడియా ప్రశ్నించగా ప్రకాష్‌ రెడ్డి సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.

‘కాంగ్రెస్‌ పార్టీతోని కలుస్తామని ఓవైసీ ఏమైనా ఇప్పటి వరకు చెప్పారా ? మేం కూడా అంతే సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుతాం’ అని చెప్పారు. ఓవైసీ పార్టీ అంటరానిదేం కాదని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఐదు లక్షల ఓట్లు వచ్చాయని, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగిన ఓవైసీ పార్టీ కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. ఏదేమైన ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు ఓ దళిత నాయకుడి చుట్టూ  తిరగడం విశేషం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top