
సాక్షి, చెన్నై : కావేరీ జలాలపై ఆందోళనకారుల నిరసనల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం చెన్నై చేరుకున్నారు. డిఫెన్స్ ఎక్స్‌పో 10వ ఎడిషన్‌ను ప్రారంభించేందుకు నగరానికి మోదీ రానుండటంతో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. విమానాశ్రయానికి సమీపంలోని అలందూర్ ప్రాంతంలో కావేరీ జలాలపై బోర్డు ఏర్పాటును కోరుతూ నిరసనలు మిన్నంటాయి. కావేరీ జలాలపై ఇటీవలి సుప్రీం కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు.
మరోవైపు నిరసనల నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డీఎంకే, ఎండీఎంకే, ఇతర తమిళ సంఘాల నిరసనలతో ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. డిఫెన్స్ ఎక్స్‌పోను ప్రారంభించే తిరువదాంతి, అడయార్‌లో జరిగే క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కార్యక్రమానికి ప్రధాని హాజరవుతుండగా ప్రత్యేక రూట్‌లో ప్రధాని కాన్వాయ్‌ను మళ్లిస్తారు. ఎస్‌పీజీకి అదనంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశామని సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు.