సీఏఏ అల్లర్లలో హింస 

Policeman Among Four Killed In Delhi Violence Over CAA - Sakshi

హెడ్‌ కానిస్టేబుల్‌ సహా నలుగురు మృతి 

డీసీపీ సహా 50 మందికి పైగా గాయాలు

హింసాయుతంగా మారుతున్న నిరసనలు 

అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న బలగాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరుగుతున్న అల్లర్లు తీవ్ర హింసారూపం దాల్చాయి. సోమవారం సీఏఏ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య జరిగిన అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మరణించినవారిలో హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌ లాల్, మరో ముగ్గురు పౌరులు ఉన్నారు. గాయపడినవారిలో డీసీపీ అమిత్‌ శర్మ సహా, ఏసీపీ, ఇద్దరు సీఆర్‌పీఎప్‌ జవాన్లు సహా 11 మంది పోలీసులు ఉన్నారని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. తీవ్రమైన అల్లర్లు చెలరేగుతున్న కారణంగా ఢిల్లీలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.


ఢిల్లీలో సీఏఏ నిరసనకారుడిపై దాడి చేస్తున్న సీఏఏ మద్దతుదారులు

ముఖ్యంగా ఢిల్లీ ఈశాన్య దిక్కున ఉన్న మౌజ్‌పూర్‌ ప్రాంతంలో సీఏఏ మద్దతుదారులు, వ్యతిరేకులు ఇద్దరూ ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బాష్పవాయు గోళాలను సైతం ప్రయోగించారు. ఆందోళనకారులు వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టారని తెలిపారు. కొన్ని గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ జఫరాబద్, మౌజ్‌పూర్‌–బాబర్‌పూర్‌ మార్గంలో మెట్రో సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బీజేపీ నేత కపిల్‌ మిశ్రా పిలుపు మేరకు సోమవారం కొందరు వ్యక్తులు మౌజ్‌పూర్‌లో గుమికూడినపుడు తాజా ఘర్షణలు చెలరేగాయి. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిని మూడు రోజుల్లో ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలని ఈ సందర్భంగా కపిల్‌ మిశ్రా పోలీసులను డిమాండ్‌ చేశారు. విషాదకర ఘటనలను అదుపులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ ద్వారా లెప్టినెంట్‌ గవర్నర్, హోంశాఖ మంత్రి అమిత్‌షాలను కోరారు.  

కావాలని చేయించిన అల్లర్లు.. ! 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రాక సందర్భంగా ఉద్దేశపూర్వకంగా ఢిల్లీలో అల్లర్లు చేయించినట్లు తమ వద్ద సమాచారం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పాయి. 

హింసాయుతం కారాదు: రాహుల్‌ 
శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యానికి గుర్తు అని, హింస ఉండరాదని రాహుల్‌ చెప్పారు. ఎవరు రెచ్చగొట్టినా సామరస్యం చూపించాలని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ.. హోంశాఖ మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. అమిత్‌షా ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తన బాధ్యతలను గాలికొదిలేశారని దుయ్యబట్టింది. 

కఠిన చర్యలు తీసుకుంటాం: కిషన్‌రెడ్డి 
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు సబబేనని, హింసాయుత నిరసనలకు తావివ్వకూడదని హోంశాఖ సహాయక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మరణించిన కానిస్టేబుల్‌ కుటుంబానికి భారత ప్రభుత్వం తరఫున తాను సంతాపం తెలుపుతున్నానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు దేశంలో పర్యటిస్తున్న వేళ ప్రభుత్వ పరువును దెబ్బతీసేందుకే ఈ నిరసనలు జరుపుతున్నారని ఆరోపించారు. ఈ అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని, ఇప్పటికే పోలీసులకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top