అరాచకం, అస్థిరతలపై అసహనం

PM Narendra ModiS Mann ki Baat address - Sakshi

వ్యవస్థలో లోపాలుంటే యువత ధైర్యంగా నిలదీస్తోంది

వచ్చే దశాబ్దాలన్నీ యువతరానివే 

మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ  

న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దాలన్నీ యువతరానివేనని, వ్యవస్థపై వారికి అపారమైన నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యవస్థలు సరిగా స్పందించకపోతే యువతలో ప్రశ్నించే ధోరణి కనిపిస్తోందని కొనియాడారు. ఆకాశవాణిలో ఆదివారం నాడు ఈ ఏడాది చివరి మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. అరాచకత్వం, అనిశ్చితి పరిస్థితుల్ని నేటి తరం ద్వేషిస్తున్నారని ప్రధాని అన్నారు. కులతత్వం, బంధుప్రీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు.

పౌరసత్వ చట్ట సవరణలకు, ప్రతిపాదిత ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఇటీవల యూనివర్సిటీల్లో నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘నాకు తెలిసినంతవరకు నేటి తరం వ్యవస్థలపైనే నమ్మకం ఉంచింది. వాటిని అనుసరించాలనీ భావిస్తోంది. వ్యవస్థలు సరిగా స్పందించనప్పుడు వారిలో అసహనం పెరిగిపోతోంది.  ధైర్యంగా ప్రశ్నించే తత్వం కూడా కనబడుతోంది’’అని మోదీ అన్నారు. దేశంలో యువత అరాచకం ఏ రూపంలో ఉన్నా సహించలేరని, పాలనా వైఫల్యాలను, అస్థిరతను తట్టుకోలేకపోతున్నారని అన్నారు.

జాతి నిర్మాణంలో పాల్గొనాలి  
ధైర్యసాహసాలు, ఉత్తేజపూరిత స్వభావం కలిగిన యువతే మార్పుకి బాటలు వేస్తుందని స్వామి వివేకానంద మాటల్ని ఈ సందర్భంగా ప్రధాని  గుర్తుకు తెచ్చుకున్నారు.  జనవరి 12 వివేకానందుడి జయంతిని పురస్కరించుకొని యువత జాతి నిర్మాణంలో తమ వంతు బాధ్యతని తలకెత్తుకోవాలని, దేశ పురోగతికి కావల్సిన ఆలోచనలు చేయా లని పిలుపునిచ్చారు. దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లే సత్తా యువతకే ఉందన్నారు.

దేశీయ ఉత్పత్తులకి ప్రాచుర్యం కల్పించాలి
వచ్చే రెండు మూడేళ్లు దేశీయ ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2022లో భారత్‌ 75ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను పూర్తి చేసుక్నుంతవరకు స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని అన్నారు. భారత్‌లో భారతీయుల చేతులతో, వారి స్వేదాన్ని చిందించి తయారు చేసిన ఉత్పత్తుల్ని ఒక రెండేళ్లు వాడేలా యువతే ముందుకు రావాలని అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top