దేశీ యాప్‌లపై దృష్టి

PM Narendra Modi launches Atmanirbhar Bharat App Innovation - Sakshi

‘ఆత్మనిర్భర్‌ యాప్‌ చాలెంజ్‌’ను ప్రారంభించిన ప్రధాని

పాల్గొనాలని స్టార్టప్‌లు, ఐటీ సంస్థలకు పిలుపు

న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్‌ భారత్‌ యాప్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌లో పాల్గొనాలని ప్రధాని మోదీ స్టార్టప్‌లు, ఐటీ సంస్థలకు పిలుపునిచ్చారు. భారత్‌ తయారీ యాప్‌లు ప్రపంచ స్థాయిలో రాణించగలవని నిరూపించాలని ఆయన కోరారు. ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్న భారతీయ యాప్‌లలో ఉత్తమమైన వాటిని గుర్తించి, ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం 59 చైనీస్‌ యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఆయన శనివారం ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌’ను ప్రారంభించడం గమనార్హం. ఈ చాలెంజ్‌ ఆత్మనిర్భర్‌ యాప్‌ ఎకోసిస్టమ్‌ను రూపొందించేందుకు దోహదపడుతుందన్నారు. ‘ఎవరికి తెలుసు?, మీరు రూపొందించిన ఈ యాప్‌లను నేను కూడా ఉపయోగించవచ్చునేమో’అని ఆయన లింక్డ్‌ ఇన్‌లో వ్యాఖ్యానించారు. ప్రపంచస్థాయి ‘మేడ్‌ ఇన్‌ ఇండియా యాప్స్‌’ తయారు చేయాలని ఐటీ, స్టార్టప్‌ రంగాల వారిలో అపారమైన ఉత్సాహం ఉందని తెలిపారు.

వీరి ఆలోచనలు, ఉత్పాదనలకు సరైన వేదిక కల్పించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ కలిసి ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ యాప్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌’ ప్రారంభించాయన్నారు. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన వారు గానీ, అలాంటి ఉత్పత్తులను సృష్టించే దృష్టి, నైపుణ్యం ఉన్న వారికి ఇది సాయపడుతుందని చెప్పారు. టెక్‌ రంగానికి చెందిన వారంతా ఇందులో పాల్గొనాలని ఆయన కోరారు. కోవిడ్‌ సృష్టించిన అనేక సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయని తెలిపారు. దీంతోపాటు ప్రధాని మోదీ.. వ్యవసాయ పరిశోధనలు, విస్తరణ, విద్య రంగాలపై అధికారులతో సమీక్ష జరిపారు.

బీజేపీ శ్రేణులకు ప్రశంస
లాక్‌డౌన్‌ సమయంలో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రధాని మోదీ అతిపెద్ద సేవా యజ్ఞంగా పేర్కొన్నారు. శనివారం ఆయన ఏడు రాష్ట్రాల బీజేపీ శాఖల నేతలతో ఆన్‌లైన్‌ ద్వారా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన లాక్‌డౌన్‌ సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను కొనియాడారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

బుద్ధుని బోధనలు..నేటి సవాళ్లకు పరిష్కారాలు
బుద్ధ భగవానుని బోధనలు నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు శాశ్వత పరిష్కారం చూపుతాయని ప్రధాని మోదీ అన్నారు. ఆషాఢ పూర్ణిమ నాడు పాటించే ధమ్మ చక్ర దినం సందర్భంగా ప్రధాని వర్చువల్‌ ప్రసంగం చేశారు. ఆశ, ప్రయోజన పూర్వక జీవితమే మానవ దుఃఖాలను దూరం చేసే మార్గమని బుద్ధ భగవానుడు సారనాథ్‌లో తన మొదటి సందేశంలోనే చెప్పారన్నారు. తోటి వారిలో జీవితం పట్ల ఆశను ప్రేరేపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. లద్దాఖ్‌లో శుక్రవారం పర్యటన సందర్భంగా సింధు నది ఒడ్డున చేసిన సింధుపూజ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top