
యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు.. యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్: మోదీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మదరిహట్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోల్కతా ఫ్లై ఓవర్ దుర్ఘటన యాక్ట్ ఆఫ్ గాడ్ కాదని.. అది యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్ అని ఆయన ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లోని మదరిహట్లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్టాడుతూ.. 'ఫ్లై ఓవర్ కూలిన వెంటనే ఎవరైనా సరే సహాయకార్యక్రమాల గురించి, ప్రజలను రక్షించడం గురించి ఆలోచిస్తారు. కానీ, మమతా బెనర్జీ మాత్రం ఘటన జరిగిన వెంటనే ఈ కాంట్రాక్టు తమ హయాంలో ఇచ్చింది కాదని.. అంతకుముందు లెఫ్ట్ పార్టీలు ఇచ్చాయని స్టేట్మెంట్లు ఇచ్చారు' అని విమర్శించారు. అంతపెద్ద ట్రాజెడీ సమయంలో సైతం దీదీ బ్లేమ్ గేమ్ ఆడారని మోదీ అన్నారు.
ఢిల్లీలో రాష్ట్రాలకు సంబంధించిన ఏ కార్యక్రమాలు నిర్వహించినా దీదీ గైర్హాజరు అవుతారని దానికి కారణం ఆ కార్యక్రమాలు నిర్వహించేది మోదీ కావడమేనని ఆయన అన్నారు. మోదీ మీటింగ్లు ఏర్పాటు చేస్తే హాజరుకాకుండా ఉండే దీదీ.. ఢిల్లీకి వస్తే మాత్రం సోనియా గాంధీని కలువడం మాత్రం మరచిపోరని ఆయన ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు లెఫ్ట్, తృణముల్ కాంగ్రెస్ లకు అధికారం ఇచ్చి ప్రజలు చాలా కాలం ఎదురు చూశారని.. అయితే ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే వారికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని మోదీ అన్నారు.