కాగితంతోనైనా విమానం చేశారా?  | Sakshi
Sakshi News home page

కాగితంతోనైనా విమానం చేశారా? 

Published Wed, Nov 14 2018 1:17 AM

PM Modi admits to theft in Rafale deal before SC: Rahul Gandhi - Sakshi

మహాసముంద్‌/బలౌదా బజార్‌: రఫేల్‌ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును అనుభవం ఉన్న ప్రభుత్వ సంస్థ అయిన బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌కు కాకుండా, ఏ అనుభవమూ లేని రిలయన్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారనీ, అనిల్‌ అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. అసలు అనిల్‌ అంబానీ ఎప్పుడైనా కాగితంతోనైనా విమానం తయారు చేశారో లేదో అని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలో ఎన్నికలు జరగనున్న మహాసముంద్, బలౌదా బజార్‌ జిల్లాల్లో రాహుల్‌ మంగళవారం ప్రచారం నిర్వహించారు. రఫేల్‌ కుంభకోణంపై విచారణకు సిద్ధమవుతున్న కారణంగానే సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను అత్యవసరంగా అర్ధరాత్రి విధుల నుంచి తప్పించి సెలవుపై పంపారని రాహుల్‌ అన్నారు.

‘సీబీఐ విచారణ జరిగితే రెండే పేర్లు బయటకొస్తాయి. ఒకటి నరేంద్ర మోదీ, రెండు అనిల్‌ అంబానీ. విచారణ అంటే మోదీకి భయం’ అని ఆయన పేర్కొన్నారు. ‘మోదీ చెబుతున్నదాని ప్రకారం 2014కు ముందు దేశంలో ఎక్కడా అభివృద్ధే లేదు. ఆయన ప్రధాని అయ్యాకే అభివృద్ధి మొదలైందట. దేశం ప్రజలతో ముందుకెళ్తుంది తప్ప ఒక్క వ్యక్తితో కాదనే చిన్న విషయం ఆయనకు అర్థం కావడం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా ప్రజలను ఆయన అవమానిస్తున్నారు’ అని రాహుల్‌ అన్నారు. మోదీ ప్రజల వద్ద నుంచి డబ్బును లాక్కుని నోట్లరద్దు ద్వారా నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా, మెహుల్‌ చోక్సీ వంటి మోసగాళ్ల జేబులు నింపారని రాహుల్‌ ఆరోపించారు. నోట్లరద్దు ద్వారా దొంగలు తమ నల్లధనాన్ని తెల్లగా మార్చుకునే అవకాశాన్ని మోదీ కల్పించారనీ, ఈ చర్య వల్ల సామాన్యులు తీవ్రంగా బాధలకు గురైతే ధనవంతులు మాత్రం లాభపడ్డారని అన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement