లాక్‌డౌన్ 4.0 మార్గ‌దర్శకాలు ఇవేనా..!

Planes And Buses To Be Allowed In Select Areas In Lockdown 4 - Sakshi

లాక్‌డౌన్ 4.0 : బ‌స్సు, విమాన స‌ర్వీసుల‌కు అనుమ‌తి!

న్యూఢిల్లీ : క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు కేంద్రం విధించిన‌ లాక్‌డౌన్ మే 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తుందా లేక ఆంక్షల నుంచి పూర్తిగా సడలింపులు ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమచారం మేరకు.. ఓ వైపు లాక్‌డౌన్ కొన‌సాగిస్తూనే మ‌రో ‌వైపు ఆర్థిక కార్య‌కలాపాల‌ను ప్రారంభించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలో క‌రోనా ప్ర‌భావం త‌క్కువున్న‌ ప్రాంతాల్లో వీలైన‌న్నీ స‌డ‌లింపులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు హోంమంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఓ సీనియ‌ర్ అధికారి తెలి‌పారు. అయితే క్షేత్ర‌ స్థాయిలో పరిస్థితుల‌ను ప‌రిశీలించి సడలింపులతో తుది నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కాగా లాక్‌డౌన్ 4.0లో కొత్త నిబంధ‌న‌లు క‌లిగి ఉంటుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ మంగ‌ళ‌వారం పేర్కొన్న విష‌యం తెలిసిందే. (దేశంలో మరో 3,967 పాజిటివ్ కేసులు )

ఆటోలు, ట్యాక్సీలు కూడా..
లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలను తరలించేందుకు రైలు సర్వీసులు ఇప్పటికే ప్రారంభించగా.. దేశీయ విమాన‌, బ‌స్సు స‌ర్వీసుల‌ను న‌డిపేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నట్లు సీనియర్‌ అధికారి వెల్లడించారు. ఇటీవల ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాల నుంచి వ‌చ్చిన ముఖ్య డిమాండ్ల‌లో హాట్‌స్పాట్‌ల‌ను నిర్వ‌హించే అధికారం తమకు అప్పగించాలని కోరిన‌ట్లు, దీనికి అనుమ‌తి ల‌భించ‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో మిన‌హా మిగ‌తా ప్రాంతాల్లో తిరిగి కార్యకలాపాలు కొన‌సాగించాల‌ని సీఎంలు కోరిన‌ట్లు పేర్కొన్నారు. అలాగే హాట్‌స్పాట్‌లు మినహా మిగతా ప్రాంతాల్లో ప‌రిమిత సామ‌ర్థ్యంతో స్థానిక బ‌స్సులు న‌డ‌పడం ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. అంతేగాక ఆటోలు, ట్యాక్సీలు కూడా అనుమతించ‌నున్న‌ట్లు తెలిపారు. అయితే ప్ర‌యాణీకుల సంఖ్య‌పై ప‌రిమితులు ఉంటాయని, ఇవన్ని నాన్ కంటైన్‌మెంట్ జోన్ల‌లో మాత్ర‌మే అమలవు‌తుంటాయ‌ని ఆయ‌న అన్నారు. (లాక్‌డౌన్ పొడగింపు : 200 పాయింట్లు పతనం )

వలస కార్మికుల వల్ల క‌రోనా కేసులు
ట్రావెల్ పాస్ అనుమ‌తితో అంత‌రాష్ట్ర ర‌వాణా కూడా అనుమ‌తించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. కేవలం అత్య‌వసరమైన వస్తువులు మాత్ర‌మే కాకుండా అన్ని రకాల వస్తువులను డోర్ డెలివరీ చేయడానికి కూడా అనుమతి ఇవ్వనున్న‌ట్లు తెలిపారు. మెట్రో సర్వీసులు, లోకల్ రైళ్లు, దేశీయ విమానాలు, రెస్టారెంట్లు, హోటళ్లు తిరిగి ప్రారంభించాలని కేరళ కోరుకుంటున్న‌ట్లు ఓ అధికారి తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. వలస కార్మికులు తిరిగి రావడం వల్ల క‌రోనా కేసులు పెరుగుతున్నందున బిహార్, జార్ఖండ్, ఒడిశాలో కఠినమైన లాక్‌డౌన్ కొనసాగాలని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాగా మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధిక కేసులు న‌మోదవుతున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను  మే 31 వ‌ర‌కు పొడిగించిన విష‌యం తెలిసిందే. ఇక‌ లాక్‌డౌన్ 4.0కు సంబంధించిన నూత‌న‌ మార్గదర్శకాలపై కేంద్రం అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. (తెరుచుకున్న బ‌ద్రీనాథ్ ఆల‌యం.. కానీ )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top