జయ మృతిపై హైకోర్టుకు అనుమానాలు
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపై మద్రాస్ హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపై మద్రాస్ హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. జయలలిత మరణంపై మీడియా అనుమానాలు వ్యక్తం చేసిందని, తనుకు కూడా వ్యక్తిగతంగా అనుమానాలున్నాయని న్యాయమూర్తి జస్టిస్ వైద్యలింగం పేర్కొన్నారు. జయ మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని తామేందుకు ఆదేశించకూడదని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చేరినప్పడు ఆమె బాగానే ఆహారం తీసుకుంటున్నారని ప్రకటించారని గుర్తు చేశారు. జయ మరణం తర్వాతైనా వాస్తవాలు వెల్లడికావాలన్నారు. కేసును రెగ్యులర్ బెంచ్ కు న్యాయమూర్తి బదిలీ చేశారు.
అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ ఈ పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 22న జయ అపోలో ఆస్పత్రిలో చేరాక ఏమి జరిగిందనే విషయాలు వెల్లడించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జయలలిత మృతికి కారణాలు తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు.
తొలుత జ్వరం కారణంగా జయను ఆస్పత్రిలో చేర్చారని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తారని వార్తలు వెలువడ్డాయని తెలిపారు. అయితే అది జరగలేదని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెబుతూ అపోలో ఆస్పత్రి వారు బులిటెన్లు విడుదల చేశారన్నారు. జయ దేహాన్ని చూసిన వారు ఆమె రెండు కాళ్లు తొలగించినట్లు గమనించారని, ఆమె దేహం ఎక్కువ రోజులు చెడకుండా ఉండేందుకు ఆస్పత్రి వర్గాలు ఈ రీతిలో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోందని జోసెఫ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.


