వివాదంగా మారిన నెమలి అంత్యక్రియలు | Sakshi
Sakshi News home page

త్రివర్ణ పతాకంతో నెమలి అంత్యక్రియలు

Published Tue, May 8 2018 1:48 PM

Peacock Funerals with National Flag In Delhi - Sakshi

న్యూఢిల్లీ: సాధారణంగా యుద్ధాల్లో వీరమరణం పొందిన జవాన్లకు త్రివర్ణ పతాకం కప్పి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తారు. కానీ చనిపోయిన నెమలికి త్రివర్ణ పతాకం కప్పి అంత్యక్రియలు నిర్వహించి వివాదంలో చిక్కుకున్నారు ఢిల్లీ పోలీసులు. గత శుక్రవారం ఢిల్లీలోని తిలక్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిసరాల్లో చనిపోయిన నెమలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని త్రివర్ణ పతాకంలో చుట్టి బాక్స్‌లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఈ ఘటన వివాదస్పదంగా మారింది. పోలీసులు అలా అంత్యక్రియలు నిర్వహించడం సబబు కాదని పలువురు వన్యప్రాణి ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ‘ వన్యప్రాణి సంరక్షణ ప్రకారం ఇలాంటి పక్షులు చనిపోతే రాష్ట్ర అటవీ శాఖ వాటికి పోస్ట్‌మార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. ఇది పోలీసులు చేయాల్సిన పని కాదు’  అని వన్యప్రాణి సంరక్షణ కార్యకర్త గౌరి మౌలేక్‌ పేర్కొన్నారు.

దీనిపై పోలీసులు స్పందిస్తూ..‘ నెమలి మన జాతీయ పక్షి కాబట్టి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. మేం ప్రొటోకాల్‌ను పాటించాం‌. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే నెమళ్లు చనిపోయినట్లు మా దృష్టికి వస్తే వాటికి కూడా ఇలాగే అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తాం’ అని తెలిపారు.

Advertisement
Advertisement