
న్యూఢిల్లీ: భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ)గా సీనియర్ దౌత్యవేత్త పంకజ్ శరణ్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ పంకజ్ నియామకానికి ఆమోదముద్ర వేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1982 ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) బ్యాచ్‌కు చెందిన పంకజ్ 2015 నుంచి ఇప్పటివరకూ రష్యాలో భారత రాయబారిగా ఉన్నారు. ప్రధాని కార్యాలయంలో 1995–99 మధ్యకాలంలో డిప్యూటీ కార్యదర్శిగా, 2007 నుంచి 2012 వరకూ సంయుక్త కార్యదర్శిగా పంకజ్ పనిచేశారు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో పంకజ్ సహాయకారిగా ఉండనున్నారు.