
పాక్ స్పైతో పాటు హనుమాన్‌జీకి ఆధార్
ఢిల్లీలో పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయంలోని వీసా విభాగంలో పనిచేస్తున్న పాక్ ఉద్యోగి మెహమూద్ అక్తర్‌ను భారత్‌లో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పోలీసులు ఇటీవల నిర్బంధంలోకి తీసుకొని విచారించిన విషయం తెల్సిందే.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయంలోని వీసా విభాగంలో పనిచేస్తున్న పాక్ ఉద్యోగి మెహమూద్ అక్తర్‌ను భారత్‌లో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పోలీసులు ఇటీవల నిర్బంధంలోకి తీసుకొని విచారించిన విషయం తెల్సిందే. ఆయన వద్ద ఆర్మీ, పారా మిలటరీ స్థావరాలకు సబంధించిన రహస్య పత్రాలు కూడా దొరకడంతో మెహమూద్ అక్తర్‌ను ‘పర్సోనా నాన్ గ్రాటా’ కింద దేశంలో ఉండేందుకు అనర్హుడంటూ తక్షణం దేశం విడిచి పోవాల్సిందిగా కూడా ఉన్నతాధికారాలు ఆదేశాలు జారీ చేశారు. అక్తర్ పాకిస్థాన్ దౌత్య సిబ్బంది కేడర్‌కు చెందిన వ్యక్తి అవడంతో భారత చట్టాల నుంచి మినహాయింపు ఉండడంతో అరెస్ట్ చేయకుండా వదిలేయాల్సి వచ్చిందని కూడా పోలీసు అధికారులు తెలిపారు.
అసలు అక్తర్ దేశంలో గూఢచర్యానికి ఎలా పాల్పడ్డారు? ఈ దేశ పౌరుడిగా చెప్పుకుంటూ సైనిక స్థావరాల వివరాలు సేకరించేంత దూరం ఎలా చొచ్చుకుపోయారన్న విషయంలోనే అసలు కిటుకు ఉంది. అక్తర్ వద్ద మెహబూబ్ రాజ్‌పుత్ పేరిట ఆధార్ కార్డు ఉంది. ‘మెహబూబ్ రాజ్‌పుత్, సన్ ఆఫ్ హసన్ అలీ, రిసైడింగ్ ఎట్ 2350, గలీ నియర్ మదారి, రోడ్‌గ్రాన్ మొహల్లా ఇన్ చాందినీ చౌక్’ అనే చిరునామా ఆ ఆధార్ కార్డుపై ఉంది. ఆ ఇంటి చిరునామా కరక్టేగానీ అది చాందినీ చౌక్‌కు కిలోమీటరు దూరంలోని రెడ్‌లైట్ ఏరియాలోని జీటీ రోడ్డులో ఉందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా చాందినీ చౌక్‌లో రోడ్‌గ్రాన్ మొహల్లా లేదని వారు చెప్పారు. ఆశిక్ అలీ, యసీర్ అనే అనుచరుల సహకారంతో అక్తర్ ఆధార్‌కార్డును సంపాదించారని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం అన్ని పథకాలకు ఆధార్ కార్డే ప్రభుత్వం ఆధారమంటున్న నేటి పరిస్థితుల్లో ఎవరు పడితే వారు ఇలా నకిలీ ఆధార్ కార్డులు సంపాదిస్తే కష్టమేనని, అక్తర్ నకిలీ కార్డు విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని యూఐఏఐ కార్యాలయానికి లేఖ రాశామని ఢిల్లీ క్రైమ్‌బ్రాంచ్ జాయింట్ కమిషనర్ రవీంద్ర యాదవ్ తెలిపారు. కుక్క, పిల్లి, కోడి ఫొటోలతోనే కాకుండా సాక్షాత్తు వీర భగవాన్ ‘హనుమాన్ జీ’ పేరిట ఆధార్ కార్డులిస్తుంటే మనుషులు నకిలీ పేర్లు, నకిలీ చిరునామాలతో ఆధార్ కార్డులు సాధించడం పెద్ద కష్టమా!
నకిలీ కార్డుల విషయంలో ఆధార్ అథారిటీ కార్యాలయం అధికారులను సంప్రదించగా, తాము జారీ చేసిన కార్డులను నకిలీ కార్డులు అనవద్దని, నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి కొందరు నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు సంపాదిస్తున్నారని, ఆ లైసెన్స్‌ల చిరునామా ఆధారంగా తమ సిబ్బంది ఆధార్ కార్డులు మంజూరు చేస్తున్నారని చెప్పారు.
కార్డులు జారీ చేస్తున్న ఏజెన్సీల సిబ్బంది తప్పులు చేయడం లేదంటూ తాము సమర్ధించడం లేదని, తప్పుచేసిన 200 మంది ఏజెంట్లను ఇప్పటి వరకు బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని వారు చెప్పారు. ఎన్ని ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చారన్న ప్రశ్నకు మాత్రం వారి నుంచి సమాధానం లేదు. ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయడం చెల్లదని వాదిస్తూ దాఖలు చేసిన అనేక పిటీషన్లపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ సాగుతున్న విషయం తెల్సిందే.