క్రికెట్‌ యాడ్‌పై దుమారం

Outraged On Dabur Advertisement - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మూర్ఖుడా, దద్దమ్మా, హాస్యము తెలియని వెర్రి వెంగలప్ప, అభిరుచి లేనివాడా! భిన్న సంస్కృతులు, భాషలు కలిగిన గొప్ప దేశం పట్ల గౌరవ లేకుండా క్రికెట్‌ పేరు మీద తప్పుడు జాతీయవాదాన్ని రుద్దుతున్నావు’ అంటూ ప్రముఖ బెంగాలీ చలనచిత్ర నిర్మాత సృజిత్‌ ముఖర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ‘బెంగాలీ సంస్కృతిని, రవీంద్రుడి కవిత్వాన్ని అవమానించడం అంటే అది కచ్చితంగా ఓ జాతి పట్ల విద్వేషం వెదజల్లడమే అవుతుంది’ అంటూ జర్నలిస్ట్‌ సౌమ్యజిత్‌ మజుందార్‌ విమర్శించారు. ‘నేనొక బెంగాలీని, బెంగాలీ సంస్కృతిని గౌరవిస్తాను. మా ఆత్మ అయిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కవిత్వాన్ని అవమానించావు, మేము దేవుడికి నైవేద్యంగా పెట్టే తిలర్‌ నాడును అవమానించావు. ఇందుకు క్షమాపణలు చెప్పాలి’ అని మరొకరు, ‘బెంగాలీలు భారతీయులు కాదా, వేరుగా చూసినందుకు క్షమాణలు చెప్పాలి లేదా కోర్టుకు వెళతాం’ అని ఇంకొకరు, అసలు డాబర్‌ కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించాలన్న హాష్‌ట్యాగ్‌తో మరికొందరు సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు కురిపిస్తున్నారు.

మంగళవారం జరిగిన భారత్‌–బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ సందర్భంగా టీవీల్లో ప్రసారమైన డాబర్‌ కంపెనీ ఇచ్చిన రెడ్‌పేస్ట్‌ యాడ్‌పై కొనసాగుతున్న రాద్ధాంతం ఇది. క్రికెట్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకొని డాబర్‌ కంపెనీ ఈ యాడ్‌ను రూపొందించింది. భారత్‌ ఏ దేశంతో క్రికెట్‌ ఆడుతున్నప్పుడు ఆ దేశానికి చిహ్నమైన వంటకాన్ని టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తున్న ఓ అభిమాని కసాపసా నమిలి మింగేస్తుంటే ‘సబ్‌కోఛాబాజాయెంగే (అందరిని నమిలేస్తాం)’ అన్న హాష్‌ట్యాగ్‌తో యాడ్‌ ప్రసారం అవుతోంది. అభిమాని పాత్రలో ప్రముఖ హాస్య నటుడు మనోజ్‌ పావువా నటించారు.

మొన్న పాకిస్తాన్‌తో మ్యాచ్‌ జరిగినప్పుడు ప్రసారం చేసిన యాడ్‌లో ‘వాల్‌నట్స్‌ (అక్రోట్‌ కాయలు)’ను మనోజ్‌ పరా పరా నమలడం కనిపించింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ జరిగినప్పుడు ‘స్టిక్‌జా టొఫీ (చాక్‌లెట్‌ లాంటి స్వీటు),’ వెస్ట్‌ ఇండీస్‌తో మ్యాచ్‌ జరిగినప్పుడు ‘కొబ్బరి గరిజలు’ తినడం కనిపించింది. నిన్న బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌ జరిగినప్పుడు ‘తిలర్‌ నాడు (బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు)’ తినడం కనిపించింది. రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌ రాసిన ‘బ్రిస్తీ పోర్‌ తపుర్, తుపర్‌ (చిటపట చినుకులు)’ కవితా పంక్తిని కూడా మనోజ్‌ వినిపించారు. బెంగాళీ హిందువులు దేవుళ్ల వద్ద ప్రసాదంగా ఎక్కువగా ఈ నువ్వుల ఉండలు పెడతారు. బంగ్లాదేశ్‌కు ప్రతీకగా తమ నువ్వుల ఉండలు చూపడమేమిటీ, ఠాగూర్‌ కవిత్వాన్ని ప్రస్తావించడం ఏమిటన్నది వారి ప్రశ్న.

వాస్తవానికి బెంగాల్‌ సరిహద్దుకు ఆవల ఉన్న బంగ్లాదేశీయులు కూడా నువ్వుల ఉండలను ప్రీతిగా తింటారు. ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నువ్వుల ఉండలను ప్రజలు ఎక్కువగానే తింటారు. ప్రసాదంగా కూడా పెడతారు. ఠాగూర్‌ను బంగ్లా సరిహద్దు గ్రామాల ప్రజలు గౌరవిస్తారు. ఏదేతేనేమీ విమర్శలు వెల్లువెత్తడంతో డాబర్‌ కంపెనీ బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఈ యాడ్‌ను రూపొందించడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, యాడ్‌లో అభ్యంతకరమైన భాగాన్ని తొలగిస్తున్నామని, ఎవరి మనుసులనైనా నొప్పించి ఉన్నట్లయితే అందుకు క్షంతవ్యులమంటూ వివరణ ఇచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top