‘పౌర’ ఆగ్రహం తీవ్రం

Opposition To Controversial Citizenship Amendment Act - Sakshi

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ప్రదర్శనలు 

జామియా వర్సిటీలో పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం 

ఢిల్లీ, ముంబై, లక్నో, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు 

కోల్‌కతాలో మమత భారీ ర్యాలీ 

సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రమవుతోంది. మొదట అస్సాం, త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన ఆందోళనలు సోమవారం నాటికి దేశవ్యాప్తమయ్యాయి. దేశ రాజధానిలోని జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు పలు ఇతర యూనివర్సిటీలు, ఐఐటీలు సంఘీభావం ప్రకటించి, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కోల్‌కతాలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జామియా వర్సిటీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్షాలు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించాయి. బాధ్యతారహితంగా చట్టాన్ని తీసుకువచ్చిన కేంద్రానిదే ఈ హింసకు బాధ్యత అని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు.

కేరళ రాజధాని తిరువనంతపురంలో అసాధారణంగా ప్రత్యర్థి పక్షాలు ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ నిరసనల్లో పాల్గొన్నాయి. ఢిల్లీ, లక్నో, ముంబై, హైదరాబాద్, బెంగళూరుల్లోని పలు వర్సిటీల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ విద్యార్థులు సైతం ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. కోల్‌కతాలో మమతాబెనర్జీ టీఎంసీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బెంగాల్‌లో ఎన్నార్సీ, సీఏఏలను అడ్డుకునేందుకు తన ప్రాణాలైనా ఇస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో రహదారులు, రైల్వే లైన్లను ఆందోళనకారులు  నిర్బంధించారు.  పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు, లూటీలు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
 
జామియా వర్సిటీలో..: ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై ఆదివారం పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ సోమవారం వేలాది విద్యార్థినీ, విద్యార్థులు వర్సిటీ ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. వర్సిటీ ముందున్న రోడ్లపై ఆందోళనలు నిర్వహించారు. వర్సిటీ అధికారుల అనుమతి లేకుండా పోలీసులు లోపలికి వచ్చి, విద్యార్థులపై లాఠీచార్జి చేసి, టియర్‌గ్యాస్‌ ప్రయోగించడాన్ని ప్రశ్నించారు. పోలీసుల దౌర్జన్యంపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. కొందరు విద్యార్థులు తీవ్రమైన చలిలో, చర్మాన్ని కోసేసే చలిగాలుల మధ్య షర్ట్‌ లేకుండా నిల్చుని నిరసన తెలిపారు. నిరసనకారులు జాతీయ పతాకాన్ని పట్టుకుని, మానవహారంగా నిలిచి, కేంద్రం, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  కాగా, ఆదివారం అదుపులోకి తీసుకున్న విద్యార్థుల్లో 50 మందిని సోమవారం పోలీసులు విడుదల చేశారు. ఆదివారం నాటి హింసపై దర్యాప్తు జరుపతామని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు 4 డీటీసీ బస్సులు, 100 ప్రైవేటు వాహనాలు, 10 పోలీస్‌ బైకులు ధ్వంసం చేశారన్నారు. కాగా, జామియా వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ నజ్మా అఖ్తర్‌ కూడా విద్యార్థులకు మద్దతుగా మాట్లాడారు.

నియంతృత్వంపై పోరాడుతాం: ప్రియాంక 
జామియా మిలియా విద్యార్థులకు సంఘీభావంగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు ఇండియా గేట్‌ వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారని కేంద్రంపై ప్రియాంక మండిపడ్డారు. పౌరసత్వ చట్టం పరిణామాలపై రాష్ట్రపతి కోవింద్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ తెలిపాయి.

ఇండియా గేట్‌ వద్ద ధర్నాకు దిగిన ప్రియాంక

నిబంధనలకు లోబడే పౌరసత్వం 
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర అక్రమ వలసదారులకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించదని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని నియమ నిబంధనలకు లోబడే పౌరసత్వ కల్పిస్తామని పేర్కొంది. 

ఇతర విశ్వవిద్యాలయాల్లో.. 
దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టంపై సోమవారం నిరసనలు చేపట్టారు. జామియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల తీరును ఖండించారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. లక్నోలోని నాడ్వా కాలేజీ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్‌లోని మౌలానా నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీలో ఆదివారం అర్ధరాత్రి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాశిలోని బనారస్‌ హిందూ యూనివర్సిటీ, కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీల్లోనూ విద్యార్థులు జామియా వర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా నిరసన జరిపారు. విద్యార్థులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్పూర్, మద్రాస్, బొంబాయి ఐఐటీల్లో, అహ్మదాబాద్‌ ఐఐఎం, బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ల్లో తొలిసారి విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ముంబైలోని టిస్‌(టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌) విద్యార్థులు ‘ఢిల్లీ పోలీస్‌.. షేమ్‌ షేమ్‌’ అని నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థులు ఆందోళనల్లో భారీగా పాల్గొన్నారు. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ, కాసర్‌గఢ్, పుదుచ్చేరి యూనివర్సిటీల విద్యార్థులు తరగతులను బహిష్కరిం చారు. ఆదివారం అలీగఢ్‌ వర్సిటీలో పోలీసులతో జరిగిన ఘర్షణలో దాదాపు 60 మంది విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే.  

చాలా బాధగా ఉంది

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు జరగడం దురదృష్టకరమని, ఈ పరిణామాలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాన్ని చీల్చేందుకు కొందరు స్వార్థపరులు చేస్తున్న కుట్రలకు ప్రజలు బలికారాదని, వదంతులు వ్యాప్తి చెందకుండా చూడాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం పలు ట్వీట్లు చేశారు. పౌరసత్వ చట్ట సవరణ కారణంగా భారతీయులకుగానీ, ఏ మతం వారికి కానీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. దీనిపై జరుగుతున్న ఉద్యమాలు పలు రాష్ట్రాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని తన ట్వీట్ల ద్వారా శాంతి సందేశాలను పంపే ప్రయత్నం చేశారు. ఇది శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన సమయమని, అందరూ ఐకమత్యంతో సోదరభావంతో మెలగాలని హితవు పలికారు. తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top