ఆన్‌లైన్‌లో నకిలీ ఉత్పత్తుల వెల్లువ

One In Three Indians Has Received Fake Products From e-Commerce Websites - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, మింత్రా, షాప్‌క్యూస్‌ లాంటి ఈ కామర్స్‌ సంస్థలతో ఆన్‌లైన్‌ ద్వారా తెప్పించుకుంటున్న ఉత్పత్తుల్లో ఎక్కువగా నకిలీ ఉత్పత్తులే ఉంటున్నాయని ప్రతి ముగ్గురిలో ఇద్దరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మొబైల్, కంప్యూటర్లలో ఎక్కువగా నకిలీ ఉత్పత్తులు వస్తున్నాయని, ఆ తర్వాత ఫ్యోషన్‌ ఉత్పత్తులు, ఆ తర్వాత టీవీలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల విషయంలో ఈ మోసం ఎక్కువగా జరుగుతోందని వినియోగదారులు ఆరోపించారు. ముంబైకి చెందిన మార్కెట్‌ పరిశోధన, విశ్లేషణ సంస్థ ‘వెలాసిటీ మిస్టర్‌’ తమ సర్వేలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలియజేసింది.

ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పుణె నగరాలకు చెందిన దాదాపు మూడువేల మంది ఆన్‌లైన్‌ వినియోగదారుల అభిప్రాయలను ఏప్రిల్‌ మొదటి వారంలో సేకరించడ ద్వారా ఈ సర్వేను నిర్వహించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో జషల్‌ షా తెలియజేశారు. అవకతవకలు జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ కామర్స్‌ మార్కెటింగ్‌ సంస్థలు చెబుతున్నప్పటికీ ఇలా నకిలీ సరుకులు వెల్లువెత్తడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. అమ్మకం దారే ఒరిజనల్‌ అంటూ నకిలీ సరకులను సరఫరా చేస్తే తామేమి చేయలేమని, మార్గమధ్యంలో సరకులు మారకుండా మాత్రమే తాము కట్టడి చేయగలమని ఈ కామర్స్‌ సంస్థలు తెలియజేస్తున్నాయి. తమ వ్యాపారం నమ్మకంపైకే ఎక్కువగా ఆధారపడి ఉన్నందున ఆ నమ్మకం వమ్ముకాకుండా ఉండేందుకే ఎక్కువ కృషి చేస్తామని ఆ కంపెనీలు చెబుతున్నాయి.

2026 నాటికి 20.000 కోట్ల రూపాయలకు ఈ కామర్స్‌ వ్యాపారం చేరుకుంటుందని అంచనా వేస్తున్న సమయంలో నకిలీ ఉత్పత్తులు పెరిగిపోవడం నిజంగా విచారకరమే. నకిలీ ఉత్పత్తులను గమనించి వాటిని తిప్పి పంపితే, డబ్బు వెనక్కి వస్తున్న సందర్భాలు చాలా తక్కువని, నకిలీ స్థానంలో మరో ఉత్పత్తిని తీసుకోవడమే ఎక్కువ సార్లు జరుగుతోందని వినియోగదారులు చెబుతున్నారు. ఒరిజనల్‌ కన్నా తక్కువ ధరకు వస్తే నకిలీ ఉత్పత్తులనైనా తీసుకునేందుకు తాము సిద్ధమేనని ప్రతి నలుగురిలో ఒకరు చెబుతుండగా, ఒరిజనల్‌తో సమానమైన నాణ్యత కలిగి ఉన్నట్లయితే వాటిని తీసుకునేందుకు తాము సిద్ధమని 20 శాతం మంది వినియోగదారులు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top