వారం రోజులుగా నగరం, శివారు, జలాశయాల పరిసరాల్లో కురిసిన భారీవర్షాలతో ముంబైకర్లకు ఊరట లభిస్తోంది.
సాక్షి, ముంబై: వారం రోజులుగా నగరం, శివారు, జలాశయాల పరిసరాల్లో కురిసిన భారీవర్షాలతో ముంబైకర్లకు ఊరట లభిస్తోంది. వరా నగరవాసులకు అదనంగా 10 శాతం నీటి కోత విధించాలని తీసుకున్న నిర్ణయాన్ని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఉపసంహరించుకుంది. జూన్‌లో వర్షాలు పడకపోవడంతో జలాశయాల్లో రోజురోజుకూ నీటిమట్టం తగ్గిపోసాగింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా బీఎంసీ 20 శాతం నీటి కోత అమలుచేసింది. అంతకు ముందునుంచే అనధికారికంగా ఐదు శాతం కోత అమలవుతోంది.
దీంతో ప్రస్తుతం మొత్తం 25 శాతం నీటి కోత అమలులో ఉంది. కాని జూలై మొదటి వారంలో కూడా వర్షాలు పత్తా లేకుండా పోవడంతో అదనంగా 10 శాతం నీటి కోత అమలు చేయాలని బీఎంసీ పరిపాలన విభాగం నిర్ణయించింది. ఈ వారం నుంచి ఇది అమలులోకి రావాల్సి ఉంది. అయితే అంతలోనే వర్షాలు జోరందుకోవడంతో అదనపు 10 శాతం నీటి కోత ప్రతిపాదనను బీఎంసీ ఉపసంహరించుకుంది. కాగా ప్రస్తుతం అమలులో ఉన్న 25 శాతం నీటి కోతను అలాగే కొనసాగించనున్నట్లు బీఎంసీ వర్గాలు తెలిపాయి.
వర్షా కాలం ప్రారంభమైన దాదాపు 45 రోజులు కావస్తున్నప్పటికీ జలాశయాల పరిసరాల్లో అనుకున్నంతమేర వర్షపాతం నమోదు కావడం లేదు. పొవాయి జలాశయం మినహా మిగతా వాటిలో నీటిమట్టం పెరగలేదు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)లకు, భవన నిర్మాణ పనులకు, మినరల్ వాటర్ బాటిల్ ప్యాకింగ్ కంపెనీలకు, శీతల పానీయాల కంపెనీలకు నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. కేవలం ఆయా కంపెనీలు, ఇతర విభాగాల్లో పనిచేసే సిబ్బందికి తాగేందుకు నీరు మాత్రమే సరఫరా చేయనుంది. అదే విధంగా మాల్స్, స్టార్ హోటల్స్, ఫ్యాక్టరీలకు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు 50 శాతం నీటి కోత అమలు చేయనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న టవర్లు, ఆకాశహర్యాలు, సొసైటీలు, వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయాలకు కొత్తగా నీటి కనెక్షన్లు ఇవ్వకూడదని నిర్ణయించింది.